కోల్‌కత్తా: మార్చి-ఏప్రిల్‌లో జరగనున్న ఆసియా కప్, వరల్డ్ టీ20లో ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కని మనీష్ పాండే తన ఆత్మస్థైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచించాడు. ఇలాంటి సమయాల్లోనే మరింత ధృడంగా ఉండి, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని గంగూలీ సూచించాడు.
'మనీష్ పాండే నిరాశను దగ్గరకు రానీయొద్దు. మరింత రాణించేందుకు ప్రయత్నించు. పాండే కంటే రహానే మెరుగ్గా ఉన్నందువల్లే స్థానం దక్కలేదు. నువ్వు ఆడటానికి వరల్డ్ టీ20, ఆసియా కప్ ఒక్కటే క్రికెట్ కాదు. ఇప్పటికే నీ పేరు సెలక్టర్లు దృష్టిలో ఉన్నందున బాధ పడాల్సిన అవసరం లేదు. త్వరలో నీకు మరో ఛాన్స్ వస్తుంది' అని గంగూలీ శుక్రవారం మీడియాతో చెప్పాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో మనీష్ పాండే అద్భుతమైన సెంచరీతో రాణించి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. జట్టు ఆపదలో ఉన్నప్పుడు రాణించి సెలక్టర్లను పాండే ఆకర్షించాడు. దీంతో ఈ నెలలో శ్రీలంకతో జరిగే మూడు టీ20ల సిరిస్‌లో పాండేకు చోటు కల్పించారు.
శ్రీలంకతో జరిగే సిరిస్‌కు టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ స్థానంలో మనీష్ పాండేకు అవకాశం కల్పించారు. టీమిండియా పేసర్లు భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మలకు కూడా వరల్డ్ టీ20లో చోటు దక్కని విషయం తెలిసిందే.