సీనియర్ క్రికెటర్ మనీష్ పాండేకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ (కేఎస్‌సీఏ) షాక్ ఇచ్చింది. విజయ్ హజారే ట్రోఫీకి ప్రకటించిన కర్ణాటక ప్రాబబుల్స్ జట్టులో మనీష్‌కు చోటు దక్కలేదు. ఉద్దేశపూర్వకంగానే మనీష్‌ను ఎంపిక చేయలేదని కేఎస్‌సీఏ మెన్స్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అభిరామ్ తెలిపాడు. యువకులకు అవకాశం ఇవ్వడం కోసమే వెటరన్ క్రికెటర్‌ను పక్కనపెట్టామని వివరించాడు.
''మనీష్ పాండేది అద్భుతమైన కెరీర్. కానీ ఇప్పుడు ప్రఖర్ చతుర్వేది, అనీశ్వర్ గౌతమ్, కేవీ అవినాష్ వంటి యువకులకు అవకాశం ఇచ్చే సమయం ఆసన్నమైంది'' అని అభిరామ్ పేర్కొన్నాడు. దశాబ్దానికి పైగా కర్ణాటక తరఫున ఆడుతున్న మనీష్ రంజీ ట్రోఫీ సెకండ్ లెగ్‌లో కూడా ఆడే అవకాశం కనిపించట్లేదు. 2009లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అజేయ సెంచరీ సాధించి మనీష్ తన క్రికెట్ ప్రయాణాన్ని గొప్పగా ఆరంభించాడు.

ఐపీఎల్‌లో సెంచరీ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డు సాధించాడు. కానీ అదే జోరును కొనసాగించలేకపోయాడు. ఇటీవల జరిగిన మెగా వేలంలో తొలి రౌండ్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. తర్వాత కనీస ధర రూ.75 లక్షలతో కోల్‌కతా నైట్ రైడర్స్ మనీష్ పాండేను కొనుగోలు చేసింది. గత వేలంతో పోలిస్తే మనీష్‌కు రూ.25 లక్షలు అదనంగా లభించినప్పటికీ.. 2018లో అతను పలికిన ధరతో పోలిస్తే చాలా చాలా తక్కవు. 2018లో మనీష్ పాండే కోసం సన్‌రైజ్స్ హైదరాబాద్ రూ.11 కోట్లు వెచ్చించింది.
2018లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మనీష్ పాండే 29 వన్డేలు, 39 టీ20లు ఆడాడు. వన్డేల్లో 566, పొట్టి ఫార్మాట్‌లో 709 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 171 మ్యాచ్‌లు ఆడిన అతను 3850 పరుగులు సాధించాడు. ఆర్సీబీతో పాటు ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, కేకేఆర్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు.