హైదరాబాద్: కెప్టెన్ కోహ్లీతో విభేదాల కారణంగా అనిల్ కుంబ్లే కోచ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుంబ్లే-కోహ్లీ విభేదాలపై నివేదిక ఇవ్వాలని జట్టు మేనేజర్‌ని బీసీసీఐ అదేశించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో జట్టు మేనేజర్ కపిల్ మల్హోత్రా నివేదికకు ప్రాధాన్యం ఏర్పడింది. కోచ్‌గా రాజీనామా చేసిన కుంబ్లేతో వివాదంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ పాత్రేమీ లేదని తేల్చేశాడు. అంతేకాదు బీసీసీఐకి సమర్పించిన నివేదికలో కోహ్లీ ఎలాంటి వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని స్పష్టం చేశాడు.
స్వదేశంలో కానీ, విదేశంలో కానీ మ్యాచ్‌లు జరిగినప్పుడు సిరీస్ ముగిసిన తర్వాత జట్టుకు సంబంధించిన నివేదికను మేనేజర్ బోర్డుకు సమర్పించడం ఆనవాయితీ. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కోహ్లీ సేన ఇంగ్లాండ్‌లో ఉన్న సమయంలో ఎలాంటి వివాదాస్పద అంశాలు చోటుచేసుకోలేదని తన నివేదికలో కపిల్ పేర్కొన్నాడు.

ఈ నివేదికలో కోహ్లీకి ప్రతికూలమైన అంశాలు ఏమీ అందులో లేవు. 'కపిల్ మల్హోత్ర నివేదిక సమర్పించాడు. కోచ్ కుంబ్లే పట్ల కోహ్లి దురుసుగా ప్రవర్తించాడని చెప్పే విషయమేదీ అందులో లేదు. క్రమశిక్షణారాహిత్యం కిందికి వచ్చే ఏదైనా ఘటనను కూడా అతడు ప్రస్తావించలేదు' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా కోచ్‌తో కెప్టెన్ ఎలాంటి ఘర్షణకు దిగలేదు. అతను ఎలాంటి క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలకు పాల్పడలేదు. అసలు ఇక్కడ ఎలాంటి వివాదం చోటు చేసుకోలేదు అని మేనేజర్ నివేదికలో పేర్కొన్నాడు అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వివరించాడు.
కాగా, ప్రాక్టీస్ సెషన్ల సందర్భంగా కూడా కుంబ్లే, కోహ్లీ మాట్లాడుకోని విషయాన్ని ప్రస్తావించినప్పుడు 'డ్రెస్సింగ్‌రూమ్ వాతావరణాన్ని చెడగొట్టే ఘటనలేవైనా జరిగితే చెప్పాలని మేనేజర్‌కు ప్రత్యేకంగా సూచించాం. కానీ అతడి నివేదికలో అలాంటిదేమీ లేదు' అని ఆ ఉన్నతాధికారి చెప్పాడు.