అగ్రరాజ్యం అమెరికాలో కూడా క్రికెట్ సందడి మొదలు కానుంది. అమెరికన్ క్రికెట్ ఎంటర్‌ప్రైజెస్ (ఏసీఈ) తొలిసారి అమెరికాలో ఆరు జట్లతో మేజర్ లీగ్ క్రికెట్ (ఎంసీఎల్) పేరుతో క్రికెట్ లీగ్‌ను మొదలు పెట్టింది. ఈ నెల 13వ తేదీ నుంచి ఈ లీగ్ మొదలవుతుంది. ఈ లీగ్ ఓటీటీ హక్కులను జియో సినిమాస్ దక్కించుకుంది. అలాగే స్పోర్ట్స్18 ఛానెల్‌లో కూడా మ్యాచులు ప్రసారం అవుతాయి.
తొలి మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్, లాస్ ఏంజెలిస్ నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఈ రెండు టీమ్స్ టెక్సాస్‌లో డల్లాస్ సమీపంలోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో ఢీకొట్టనున్నాయి. మేజర్ లీగ్ క్రికెట్‌లో మొత్తం ఆరు టీమ్స్ తలపడనున్నాయి. వీటిలో మూడు టీమ్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చెందినవే కావడం గమనార్హం. లాస్ ఏంజెలిస్ నైట్ రైడర్స్, ఎంఐ న్యూయార్క్, టెక్సాస్ సూపర్ కింగ్స్ మూడూ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చెందిన టీమ్సే.

ఇవికాక శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, సియాటెల్ ఓర్కాస్, వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్లు కూడా తలపడనున్నాయి. ఈ టీమ్స్ అన్నింటిలో అంతర్జాతీయ స్థాయి ప్లేయర్లతోపాటు అమెరికాలోని బెస్ట్ ప్లేయర్లు కూడా ఆడతారు. ఈ తొలి సీజన్‌లో మ్యాచులు రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరుగుతాయి. వీటిలో టాప్-4 జట్లు ప్లేఆఫ్స్ ఆడతాయి. జులై 30న ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ట్రోఫీ దక్కుతుంది.
ఈ లీగ్ గురించి వయాకామ్18 స్పోర్ట్స్ స్ట్రాటజీ హెడ్ హర్ష శ్రీవాస్తవ మాట్లాడుతూ.. క్రీడల ల్యాండ్‌స్కేప్‌ను మార్చేందుకు జియోసినిమా కృషి చేస్తోందని చెప్పారు. మేజర్ లీగ్ క్రికెట్‌లో ఫ్యాన్స్ తమ ఫేవరెట్ ప్లేయర్లను చూసి వాళ్లను చీర్ చేస్తారని తెలిపారు. ముఖ్యంగా భారతీయులకు టీ20 క్రికెట్ అంటే చాలా ఇష్టమని, వాళ్లు కచ్చితంగా మేజర్ లీగ్ క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తారని చెప్పారు.