అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్-2024లో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు ఫైనల్‌కు చేరింది. గురువారం శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌తో జరిగిన క్వాలిఫయిర్ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఆల్‌రౌండ్‌షోతో సత్తాచాటి ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ట్రావిస్ హెడ్ (77 నాటౌట్; 44 బంతుల్లో, 10 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్లెన్ మాక్స్‌వెల్ (54 నాటౌట్; 23 బంతుల్లో, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడారు.
మొదట బ్యాటింగ్ చేసిన శాన్‌ఫ్రాన్సిస్కో 19 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. హసన్ ఖాన్ (57; 36 బంతుల్లో, 36 బంతుల్లో, 6 సిక్సర్లు) అర్ధశతకంతో ఆదుకున్నాడు. కెప్టెన్ కోరి అండర్సన్ (26; 19 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. వాషింగ్టన్ బౌలర్లలో రచిన్ రవీంద్ర నాలుగు, జేన్సన్ మూడు వికెట్లతో సత్తాచాటారు. 2.4 ఓవరల్లో రచిన్ 11 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శాన్‌ఫ్రాన్సిస్కో 66 పరుగులకు కీలక అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన అండర్సన్‌తో కలిసి హసన్ ఖాన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. దూకుడుగా ఆడుతూ జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. అనంతరం ఛేదనలో వాషింగ్టన్ ఫ్రీడమ్ 15.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.
అయితే వాష్టింగ్టన్‌కు శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్‌లో కెప్టెన్ స్టీవ్ స్మిత్ (1; 3 బంతుల్లో) వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఆండ్రిస్ గౌస్ (9; 14 బంతుల్లో, 2 ఫోర్లు), రచిన్ రవీంద్ర (3; 9 బంతుల్లో) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. అయితే ఈ స్థితిలో వచ్చిన మాక్సీలో కలిసి హెడ్ ఇన్నింగ్స్ నిర్మించాడు. మాక్సీ-హెడ్ బౌండరీలతో హోరెత్తించి జట్టుకు విజయాన్ని అందించారు.
కాగా, ఇవాళ రాత్రి జరగనున్న ఛాలెంజర్ మ్యాచ్ శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ వర్సెస్ టెక్సాస్ సూపర్ కింగ్స్ విజేతతో వాషింగ్టన్ ఫ్రీడమ్ ఫైనల్‌లో తలపడనుంది. ఆదివారం టైటిల్ పోరు జరగనుంది.