మేజర్ లీగ్ క్రికెట్-2024లో టెక్సాస్ సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న ఫాప్ డుప్లెసిస్ మెరుపు శతకం సాధించాడు. చర్చ్ స్ట్రీట్ పార్క్ వేదికగా వాష్టింగ్టన్ ఫ్రీడమ్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 56 బంతుల్లో సెంచరీ బాదాడు. డుప్లెసిస్ చెలరేగడంతో సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలోఅయిదు వికెట్లకు 203 పరుగులు చేసింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టెక్సాస్‌కు అదిరే ఆరంభం దక్కింది. డెవాన్ కాన్వే (39; 26 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్)తో కలిసి డుప్లెసిస్ ఆది నుంచే దూకుడుగా ఆడాడు. పవర్‌ప్లేలో టెక్సాస్ 67 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరూ అదే జోరు కొనసాగించడంతో పది ఓవర్లలోపే జట్టు స్కోరు 100 మార్క్‌ను అందుకుంది. కానీ 11వ ఓవర్‌లో కాన్వేను సౌరభ్ నేత్రావల్కర్ ఔట్ చేయడంతో 109 పరుగుల వద్ద టెక్సాస్ తొలి వికెట్ కోల్పోయింది.

ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేపోయారు. కానీ మరో ఎండ్‌లో ఉన్న డుప్లెసిస్ మాత్రం స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న డుప్లెసిస్ వికెట్లు పడుతుండటంతో కాస్త నెమ్మదించాడు. కానీ 14వ ఓవర్ నుంచి ఊపందుకున్నాడు. 12 ఫోర్లు, అయిదు సిక్సర్లతో హోరెత్తించి శతకం సాధించాడు. డుప్లెసిస్ ధాటికి మేజర్ లీగ్, చర్చ్ స్ట్రీట్ వేదిక రికార్డులు బద్దలయ్యాయి. ఈ వేదికలో, అలాగే ఈ సీజన్‌లో మొదటిసారి 200+ స్కోరు సాధించిన జట్టుగా టెక్సాస్ సూపర్ కింగ్స్ రికార్డు సాధించింది.
అయితే భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వాషింగ్టన్ ఫ్రీడమ్ మెరుపు ఆరంభంతో ఛేదన మొదలుపెట్టింది. ట్రావిస్ హెడ్ (32 నాటౌట్; 12 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (26 నాటౌట్; 13 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించారు. వీరిద్దరి ధాటికి 4 ఓవర్లలో వాషింగ్టన్ 62 పరుగులు చేసింది. అయితే ఈ స్థితిలో వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. వాషింగ్టన్ మరో ఓవర్ పాటు బ్యాటింగ్ చేసి ఉంటే అయిదు ఓవర్లతో డక్‌వర్త్‌లూయిస్ పద్ధతిలో మ్యాచ్ ఫలితం వచ్చేది.