
రాజ్‌కోట్: భారత్ అత్యుత్తమ జట్టు. అనుభవమున్న ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఒక మ్యాచ్ గెలిచాం, ఇక సిరీస్ గెలిస్తే బంగ్లాదేశ్‌కు పెద్ద ఊరట అని ప్రస్తుత బంగ్లాదేశ్ క్రికెట్ ఆ జట్టు టీ20 కెప్టెన్ మహ్మదుల్లా పేర్కొన్నాడు. సిరీస్ ప్రారంభానికి ముందు బంగ్లా ఆల్‌రౌండర్, కెప్టెన్ షకిబుల్ హసన్‌పై ఐసీసీ రెండేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు పలువురు బంగ్లా క్రికెటర్లు జీతభత్యాలపై నిరసన తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌పై సిరీస్ గెలిస్తే తమ జట్టుకు పెద్ద ఊరట అని మహ్మదుల్లా అన్నాడు.
మహ్మదుల్లా మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ' భారత్ అత్యుత్తమ జట్టు. ఒక టీ20 మ్యాచ్ గెలిచాం. భారత్ కచ్చితంగా గట్టి పోటీ ఇస్తుంది కాబట్టి రెండో మ్యాచ్‌లో మా జట్టు మంచి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. మేము సిరీస్ నెగ్గడానికి ఇది మంచి అవకాశం. రెండో టీ20 మ్యాచ్ ఆడేందుకు మా ఆటగాళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంచి ప్రదర్శన చేస్తామన్న నమ్మకం ఉంది. మా ఆటగాళ్లు ప్రతీ ఒక్కరూ కష్టపడుతున్నారు. భారత్‌పై సిరీస్ గెలిస్తే మాకు అదనపు బలం' అని పేర్కొన్నాడు.
'టీ20ల్లో వికెట్‌ను అంచనా వేసి ఫీల్డర్లను సరైన స్థానాల్లో ఉంచితే ఫలితాలు వస్తాయి. అలాగే పరిస్థితులను బట్టి సరైన నిర్ణయాలు కూడా తీసుకోవాలి. రాజ్‌కోట్ మైదానం బ్యాట్స్‌మన్‌కు సహకరిస్తుంది. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే వికెట్‌ను పరిశీలించాలి. పిచ్‌పై అవగాహన ఉంటే బాగా ఆడేందుకు అవకాశం ఉంటుంది. తొలి బంతి నుంచే ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయిస్తే మ్యాచ్‌పై పట్టు దక్కుతుంది. బ్యాటింగ్ బాగా చేస్తే భారీ పరుగులు చేయొచ్చు. గెలవడానికి బరిలోకి దిగుతాం' అని మహ్మదుల్లా అన్నాడు.
ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే రెండో టీ20కి మహా తుఫాన్ ముప్పు పొంచి ఉంది. బుధవారం సాయంత్రం కూడా రాజ్‌కోట్‌లో భారీ వర్షం కురిసింది. గురువారం తుపాను గుజరాత్ తీరం దాటే అవకాశం ఉండడంతో రాజ్‌కోట్‌లో భారీ వర్షం పడొచ్చు. అయితే ఈ రోజు మధ్యాహ్నంకల్లా తుఫాన్ బలహీన పడుతుందని, సాయంత్రం వరకు ఆకాశం మేఘావృతంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి వేళలో మాత్రం ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయట. మరి ఈ రోజు వరణుడు ఏం చేస్తాడో చూడాలి.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో మ్యాచ్ గురువారం (నవంబర్ 7) రాజ్‌కోట్‌లో జరుగుతుంది. నవంబర్ 10న నాగపూర్ వేదికగా మూడో మ్యాచ్ జరగనుంది. ఇక నవంబర్ 14 నుండి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. నవంబర్ 22 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్‌లు తొలిసారి డేనైట్ టెస్టు మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే.