
ఐపీఎల్ 2022సీజన్‌లో భాగంగా నేడు కీలక మ్యాచ్ జరుగుతోంది. ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బరిలోకి దిగాయి. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో 7:30గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20ఓవర్లు ముగిసేసరికి 8వికెట్లు కోల్పోయి 173పరుగులు చేసింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బ్యాటింగ్ పరంగా శుభారంభం దక్కింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ ద్వయం బౌలర్లపై అటాక్ చేసింది. ముఖ్యంగా ఫాఫ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. దీంతో స్కోరు 5ఓవర్లకే 50పరుగులు దాటింది. ఇక డుప్లెసిస్ 22బంతుల్లో 4ఫోర్లు, 1సిక్సర్‌తో 38పరుగులు చేశాడు. వీరిద్దరు కలిసి తొలి వికెట్ పడిపోయే సరికి 62పరుగుల పార్ట్ నర్ షిప్ నమోదు చేశారు. వీరి జోడీని మోయిన్ అలీ విడదీశాడు. మ్యాక్స్ వెల్ మాత్రం 3పరుగులకే రనౌట్ అయి నిరాశపరిచాడు. ఉతప్ప సమయస్ఫూర్తి ధోనీ చాకచక్యంతో మ్యాక్సీ ఔటయ్యాడు. ఇక విరాట్ కోహ్లీ సైతం తడబడుతూ బ్యాటింగ్ చేశాడు. 33బంతుల్లో 30పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. కానీ యువ బ్యాటర్ మహిపాల్ లోమ్రోర్ 27బంతుల్లో 42పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. చివర్లో రజత్ పాటిదర్ (21పరుగులు), దినేశ్ కార్తీక్ (26పరుగులు 17బంతుల్లో 1ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో ఆర్సీబీ 8వికెట్లు కోల్పోయి 173పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్‌తో మళ్లీ జట్టులో చేరిన మోయిన్ అలీ 2వికెట్లతో రాణించి జట్టుకు మంచి బ్రేక్ ఇచ్చాడు. ఇక మహేష్ తీక్షణ సైతం తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 3వికెట్లు తీసి రాణించాడు.
తుది జట్లు :
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్, కెప్టెన్), రవీంద్ర జడేజా, డ్వైన్ ప్రిటోరియస్, సిమర్‌జీత్ సింగ్, ముఖేష్ చౌదరి, మహేశ్ తీక్షణ