పెర్త్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మధ్య సంబంధాలపై అంతులేని పుకార్లు చెలరేగాయి. అయితే, అవన్నీ ఊహాగానాలు మాత్రమేనని, వాటిలో నిజం లేదని తేలిపోయింది. పెర్త్‌లోని హోటల్ హ్యాట్‌లో మంగళవారంనాడు ఇద్దరు మాత్రమే అత్యంత సన్నిహితంగా మెలుగుతూ నడిచిపోవడాన్ని గమనిస్తే వారిద్దరి మధ్య స్నేహం పటిష్టంగా ఉందని అర్థమవుతోందని అంటున్నారు.
భారత కెప్టెన్ ధోనీ, ఆయన డిప్యూటీ విరాట్ కోహ్లీ అత్యంత సన్నిహితంగా, దీర్ఘకాలిక మిత్రుల మాదిరిగా వారు హోటల్లో కనిపించారు. చేతిలో చేయి వేసేంత దగ్గరగా మెలుగుతూ మాట్లాడుకున్నారు. దానివల్ల వారు ఏం మాట్లాడుతున్నానేది కూడా ఎవరికీ వినిపించలేదు. దాదాపుగా వారిద్దరు గుసగుసలు పెట్టుకున్నట్లు అనిపించిందని అక్కడ వారిని చూసినవారు అంటున్నారు.

కోహ్లీ షార్ట్, వైట్ వెస్ట్ ధరించగా, ధోనీ ఎర్ర రంగు టీషర్ట్, ఆర్మీ గ్రీన్ బ్యాగీ ప్యాంట్స్ ధరించి కూల్‌గా కనిపించాడు. కొద్ది మంది జర్నలిస్టులు అక్కడ ఉన్న విషయాన్ని ధోనీ గమనించాడు. వారిని చూసి అతను నవ్వాడు. కోహ్లీ తన ఐప్యాడ్ చూస్తూ కనిపించాడు. ఆ తర్వాత మొహమ్మద్ షమీ వారితో చేరాడు. ముగ్గురు కలిసి హోటల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అది లంచ్ టైమ్ కావడం విశేషం.
వారు ఎక్కడికి వెళ్లారనేది తెలియదు. వారు వచ్చిన హోటల్లో ఎక్కువగా ఓరియంటల్, ఆసీస్ వంటకాలే ఉన్నాయి. అందువల్ల వారికి వాటిలో భారత రుచులు కనిపించి ఉండవు. వారు భారత వంటకాలు గల మరో హోటల్‌కు వెళ్లి ఉండవచ్చునని అంటున్నారు.