మిర్పూర్: అంపైర్లు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఉపయోగిస్తుండటంపై టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అసంతపృప్తి వ్యక్తం చేశాడు. ఇయర్ పీస్ లాంటి వస్తువులను అంపైర్లు ఉపయోగించడం సరికాదని పేర్కొన్నాడు.
ఆశీష్ నెహ్రా బౌలింగ్ లో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ ఖుర్రం మంజూర్ కొట్టిన బంతిని తప్పించుకోవడంలో బంగ్లాదేశ్ అంపైర్ ఎస్ఐఎస్ సైకత్ విఫలమయ్యాడు. ఆ సమయంలో సైకత్ తన చెవికి ఇయర్ పీస్ తగలించుకుని ఉన్నాడు. దీని గురించి మీడియా ప్రతినిధులు అడిగిన సందర్భంగా ధోనీ సరదాగా స్పందించారు.

'టీ20 ప్రపంచ కప్ టోర్నీలో నన్ను ఆడకుండా చేయాలనుకుంటున్నారా? నాపై వేటు పడాలని కోరుకోవద్దు' అంటూ నవ్వుతూ సమాధానం చెప్పాడు. అంపైర్లు ఇయర్ పీస్ తగిలించుకుని మైదానంలో అంపైరింగ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ధోనీ తెలిపాడు.
'అంపైర్లు వాకీటాకీతో పాటు ఇయర్ పీస్ పరికరాలు వాడుతున్నారు. దీంతో ఒక చెవితోనే మైదానంలో పని చేస్తున్నారు. ఒక చెవిని పూర్తిగా పరికరాలకు అప్పగించేయడంతో ఆటగాళ్లు చెబుతున్నది వారికి పూర్తిగా వినబడని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆన్ ఫీల్డ్ అంపైర్లు రెండు చెవులతో పని చేయడం చాలా మంచిది అని ధోనీ తెలిపాడు. అధికారులు ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని సూచించాడు.