న్యూఢిల్లీ : సెలబ్రిటీల జీవిత గాథలను 70ఎంఎం స్క్రీన్ మీదకెక్కించడం బాలీవుడ్ లో ఇప్పుడు నడుస్తోన్న ట్రెండ్. సినీ సెలబ్రిటీలే కాదు.. క్రికెటర్లు.. అథ్లెట్లు.. పొలిటీషియన్ల చాలామంది జీవిత గాథలే వెండితెర మీద దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ ధోని బయోపిక్ కూడా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.
'ద అన్ టోల్డ్ స్టోరీ' గా నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో.. ధోని పాత్రలో సుశాంత్ రాజ్ పుత్ సింగ్ కనిపించనున్నాడు. తాజాగా సినిమా గురించి స్పందించిన ధోని.. సినిమాకు సంబంధించిన విషయాల్లో తాను జోక్యం చేసుకోబోనని స్పష్టం చేశాడు.

దర్శకుడి విజన్ ఎలా ఉంటుందో తెరపైనే చూస్తానని చెప్పుకొచ్చిన ధోని.. నీరజ్ తన బయోపిక్ ను అర్థవంతంగా చిత్రీకరించగలడన్న నమ్మకముందని అభిప్రాయపడ్డాడు. సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్బంగా.. కార్యక్రమంలో పాల్గొన్న ధోని ఈ వ్యాఖ్యలు చేశాడు.
సినిమా గురించి నీరజ్ అడిగిన చాలా ప్రశ్నలకు తాను ఆసక్తిగా జవాబుల చెప్పానని తెలిపాడు ధోని. అయితే తాను క్రికెటర్ గా రాణించి.. జాతీయ జట్టుకు ఎంపికైన సమయంలో తన తల్లిదండ్రులు ఎలా ఫీలయ్యుంటారన్నది తాను తెలుసుకోలేకపోయానని అన్నాడు. కాగా, తెరపై దర్శకుడి విజన్ ద్వారా ఇప్పుడా విషయాలను తెలుసుకుంటానని చెప్పాడు. స్కూలు రోజులు తనకెప్పుడూ ప్రత్యేకంగా గుర్తుండిపోతాయని, కోచ్ ప్రోత్సాహంతోనే కెరీర్ మొదలైందని చెప్పుకొచ్చాడు.