రాంచీ: టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని సొంతఊరు రాంచీలో చక్కర్లు కొడుతున్నాడు. ఇటీవలే జింబాబ్వే పర్యటన విజయవంతంగా ముగించుకుని భారత్‌కు వచ్చిన ధోనీ.. తన సొంతపట్టణమైన రాంచీలో సందడి చేస్తున్నాడు.
భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బైక్ రైడ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.
జోరువానలో బైక్ షికారు అనంతరం తలకు రైడింగ్ హెల్మెట్ పెట్టుకుని వర్షాన్ని ఆస్వాదిస్తున్న ఫొటోను ధోనీ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశాడు.

ఓ వైపు వర్షం.. మరోవైపు బైక్ రైడ్. రాంచీకి వర్షాలు చాలా అవసరమని ధోనీ వ్యాఖ్యానించాడు.
ఇటీవల ముగిసిన జింబాబ్వే పర్యటనలో వన్డే సిరీస్‌ను 3-0 ముగించిన ధోనీ సేన టీ20 సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. న్యూజిలాండ్ పర్యటన అక్టోబర్ 16 నుంచి ఉండటంతో అప్పటి వరకు ధోనీ విరామాన్ని ఎంజాయ్ చేయనున్నాడు.
అయితే, టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నాడు. జులై 21 నుంచి నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం టీమిండియా ఆటగాళ్లు.. కొత్త కోచ్ అనిల్ కుంబ్లే ఆధ్వర్యంలో బెంగళూరులో కసరత్తులు చేస్తున్నారు.