ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ జట్టు దయనీయ స్థితిలో ఉంది. సీజన్‌ను విజయంతో ప్రారంభించినప్పటికీ, ఆపై వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి దిగజారింది. బుమ్రా ఈ ఐపీఎల్ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా 4 ఓవర్లలో 41 పరుగులిచ్చాడు. అతని చివరి రెండు ఓవర్లలో శ్రేయాస్ అయ్యర్ సునాయాసంగా పరుగులు రాబట్టడం ఫామ్‌పై ప్రశ్నలు తలెత్తాయి.
ఈ నేపథ్యంలో జట్టు హెడ్ కోచ్ మహేల జయవర్ధనే స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ప్రదర్శనపై ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా పేస్ తగ్గడానికి గల కారణాల గురించి స్పందించాడు. మొదట్లో గాయం కారణంగా పూర్తి పేస్ తో బౌలింగ్ చేయలేకపోయాడని, అది అతని వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా సాగిందని వ్యాఖ్యానించాడు. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా పుంజుకుంటోన్నాడని, చివరి రెండు మ్యాచ్‌లలో అతని పేస్ పెరిగిందని చెప్పాడు. ఇప్పుడు చాలా సౌకర్యవంతంగా ఉన్నాడని జయవర్దనే వివరించాడు.

బుమ్రా వికెట్లు తీయకపోవడాన్నీ సమర్థించాడు. అతని బౌలింగ్ లో రిథమ్ ఉందని, వికెట్లు పడగొట్టకపోవడానికి కచ్చితమైన కారణం ఏమిటనేది ఇప్పటికిప్పుడు చెప్పలేనని పేర్కొన్నాడు. పవర్‌ప్లేలో ఇతర బౌలర్లు ఒత్తిడి తేలేకపోతున్నారని, బుమ్రా బౌలింగ్ లో ఎక్కువ రిస్క్ తీసుకోవద్దనే విషయం బ్యాటర్లకు తెలుసునని స్పష్టం చేశాడు మహేల. ఒక జట్టుగా తాము ప్రత్యర్థి బ్యాటింగ్‌లో లొసుగులు కనుగొనలేకపోయామని, దీనిపై వర్కవుట్ చేయాల్సి ఉందని తేల్చి చెప్పాడు.
బుమ్రాకు వికెట్లు దక్కకపోవడానికి నిర్దుష్ట కారణాలు ఏమిటనేది తెలుసుకుంటామని, అదే సమయంలో బౌలర్లు సమష్టిగా, వేర్వేరు పిచ్‌లపై ప్రభావం చూపలేకపోతున్నారని అన్నారు. ఒక్కసారి బుమ్రా వికెట్లు తీసుకోవడం మొదలుపెడితే, ఇక అతన్ని ఆపడం కష్టమని జోస్యం చెప్పాడు. ఒక్క బుమ్రా మాత్రమే కాకుండా ఇతర బౌలర్లు కూడా వికెట్లు తీయలేకపోతున్నారనే విషయాన్ని అంగీకరించాడు. క్యాంప్‌లో గాయాలు, అనారోగ్యాల వల్ల అందరినీ ఆడించలేకపోతున్నామని, త్వరలో ఫామ్ లోకి వస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.