
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్‌కు సమయం దగ్గరపడింది. మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ముంబైలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రరూపం దాల్చడం బీసీసీఐ, ప్రాంచైజీల్లో ఆందోళన కలిగిస్తోంది. దీంతో అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కరోనా కేసులు పెరుగుతున్నా.. మ్యాచ్‌లు యథాతథంగా జరుగుతాయని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సోమవారం స్పష్టం చేశారు.
సోమవారం ఉదయం నవాబ్ మాలిక్ మీడియాతో మాట్లాడారు. 'ముంబై వేదికగా జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లకు అనుమతి ఇచ్చాం. అన్ని ఆంక్షల నడుమ ఐపీఎల్ మ్యాచ్‌లను జరుగుతాయి. కేసులు పెరుగుతున్నా మ్యాచ్‌లు యథాతథంగా కొనసాగుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించడం లేదు. ఆటగాళ్లతో పాటు ఐపీఎల్‌తో సంబంధం ఉన్నవారంతా ఐసోలేషన్‌లోనే ఉండాలి' అని మంత్రి నవాబ్ మాలిక్ అన్నారు.
ఐపీఎల్ ఆటగాళ్లకు వ్యాక్సిన్ ఇవ్వాలని బీసీసీఐ డిమాండ్ చేసిందని, కానీ ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం 45 ఏళ్ల ఆంక్ష ఉందని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అన్నారు. అయితే ఐసీఎంఆర్ కొత్త ఆదేశాలను జారీ చేస్తేనే.. దాని ప్రకారం వ్యాక్సినేషన్ జరిగే అవకాశం ఉందన్నారు. కేంద్ర సంస్థ నుంచి అనుమతి రాగానే మరింత ఉదృతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ముంబైలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
మరోవైపు మహారాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఏప్రిల్ 30 వరకు రాత్రి కర్ఫ్యూ, వారాంతాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రోజూ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు నవాబ్ మాలిక్ చెప్పారు. అలాగే ప్రతి వారం శుక్రవారం రాత్రి 8 నుంచి సోమవారం ఉదయం 7 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందన్నారు. నిత్యావసర దుకాణాలు తప్ప మిగతావన్నీ మూసివేయాలని ఆయన స్పష్టం చేశారు.
ముంబై వేదికగా జరిగే మ్యాచ్‌లను ఇతర నగరాలకు తరలించే ఆలోచనే లేదని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. దేశంలో కరోనా పరిస్థితి ఎలా ఉన్నా.. షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ 2021 సీజన్‌ను నిర్వహిస్తామన్నాడు. ఇక శుక్రవారం నుంచి ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభమవుతుండగా.. తొలి భాగంలో చెన్నై, ముంబైని వేదికలుగా ఎంపిక చేశారు. దీంతో ఏప్రిల్ 9 నుంచి 25 తేదీల మధ్య ఆ రెండు చోట్లా పదేసి మ్యాచ్‌లు జరగనున్నాయి. 9న ముంబై, బెంగళూరు జట్ల మధ్య చెన్నై వేదికగా తొలి మ్యాచ్ జరగనుండగా.. 10న చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య ముంబై వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది.