నాగ్ పూర్ : ఆడిన రెండో మ్యాచ్ లోనే అద్దిరిపోయే పెర్ఫాన్స్ తో అందరి ద్రుష్టిని ఆకర్షించాడు హైదరాబాదీ బౌలర్ మొహమ్మద్ సిరాజ్. గోవాతో జరిగిన రంజీ మ్యాచ్ లో 15 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన అతను.. కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చుకుని, 9 మొయిడిన్ ఓవర్లు వేయడం విశేషం.

రంజీట్రోఫీలో భాగంగా నాగ్ పూర్ లో జరిగిన గోవా వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ లో ఈ గణాంకాలు నమోదు చేశాడు సిరాజ్. సిరాజ్ ప్రదర్శనకు తోడు రవికిరణ్, విశాల్ శర్మ, చెరో 2వికెట్లు తీయడంతో కొత్త సీజన్ లో హైదరాబాద్ కు మంచి బోణీ లభించింది. కాగా హైదరాబాద్ బౌలర్ల దెబ్బకు గోవా 74ఓవర్లలో కేవలం 164 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక దశలో 30/5తో పీకల్లోతు కష్టాల్లో ఉన్న గోవాను సౌరభ్ బందేకర్ (144 బంతుల్లో 59, 8ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీతో ఆదుకున్నాడు.
ఇక మరో గోవా బ్యాట్స్ మెన్ కౌతాంకర్ కూడా 38 పరుగులతో ఫరవాలేదనిపించాడు. దీంతో గోవా ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ టీమ్ ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. తన్మయ అగర్వాల్ (10) తొలి వికెట్ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్ లో అక్షత్ రెడ్డి (18), విశాల్ శర్మ(0) ఉన్నారు.