IPL 2024: ఐపీఎల్ 2024.. ప్రారంభ మ్యాచ్‌లన్నీ రసవత్తరం. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు జరగ్గా.. ఫస్ట్ గేమ్ ఒక్కటే వన్ సైడ్ అయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఏకపక్షంగా మార్చివేసింది. అలవోకగా గెలుచుకుంది. మిగిలిన రెండు కూడా చివరి ఓవర్ వరకూ సాగాయి.
శనివారం జరిగిన డబుల్ హెడ్డర్స్.. డబుల్ మజా ఇచ్చాయి. మధ్యాహ్నం పంజాబ్‌లోని మల్లాన్‌పూర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ పైచేయి సాధించింది. ఢిల్లీ కేపిటల్స్‌ను ఓడించింది. చివరి ఓవర్ వరకూ సాగిన మ్యాచ్ ఇది. ఫలితం కోసం 20వ ఓవర్ వరకూ ఎదురు చూడాల్సి వచ్చింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగా.. దాన్ని 19.2వ ఓవర్‌లో ఛేదించింది పంజాబ్ కింగ్స్. ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. 19వ ఓవర్‌లో విజయం ముంగిట్లో ఉన్నప్పుడు పంజాబ్ కింగ్స్ వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోవడం మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చింది. విజయం సాధించడానికి ఏడు పరుగులే అవసరం కావడంతో దాన్ని సునాయాసంగా అందుకుంది పంజాబ్.
సన్‌రైజర్స్ హైదరాబాద్- కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్ మాత్రం హైఓల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్. చివరి బంతి వరకూ సాగిందీ మ్యాచ్. ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టింది. ఓడిపోయే మ్యాచ్‌లో తెగించి కొట్లాడింది. ఒకదశలో మ్యాచ్ మొత్తాన్నీ లాగేసుకున్నట్లు కనిపించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో 200 మార్కులను దాటిన తొలి జట్టు ఇదే. దీన్ని ఛేదించడానికి క్రీజ్‌లోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ.. చివరి వరకూ పోరాడింది గానీ విజయాన్ని అందుకోలేకపోయింది. 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేయగలిగింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్.. పరుగుల వరద పారించాడు. 29 బంతుల్లో ఎనిమిది సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. చివరి ఓవర్ అయిదో బంతికి అవుట్ అయ్యాడు.
ఇదిలావుండగా- ఐపీఎల్ 2024 నాకౌట్స్ స్టేడియాలు ఖరారయ్యాయి. ఈ వేదికలను బీసీసీఐ ప్రకటించింది. ఊహించని విధంగా స్టేడియాలు ఫిక్స్ అయ్యాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే క్వాలిఫయర్ 2, ఫైనల్స్ ఉంటాయని భావించినప్పటికీ.. షెడ్యూల్ అలా లేదు.
నరేంద్ర మోదీ స్టేడియంలో నాకౌట్స్‌లో రెండు మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. ఒకటి- క్వాలిఫయర్ 1. రెండు- ఎలిమినేటర్. మిగిలిన రెండూ చెన్నైలో ఫిక్స్ అయ్యాయి. క్వాలిఫయర్ 2, ఫైనల్స్‌ను చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. గత సీజన్‌లో ఈ రెండూ కూడా అహ్మదాబాద్ స్టేడియంలో జరిగిన విషయం తెలిసిందే.