500 రోజుల తర్వాత బాగా ఆడిన ఇన్నింగ్స్ ఇది: రోహిత్ శర్మ
హైదరాబాద్: జీవితంలో విచారం ఉంటుందని, అయితే తన కాళ్లపై నిలబడి తిరిగి క్రికెట్ ఆడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని భారత ఆటగాడు రోహిత్ శర్మ అన్నారు. తన పదేళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో కేవలం 22 టెస్టులు ఆడటంతో తనకున్న ప్రతిభకు న్యాయం చేసినట్టేనా? అన్న ప్రశ్నకు పైవిధంగా సమాధానమిచ్చాడు.

కెరీర్లో మూడో సెంచరీని నమోదు చేసిన రోహిత్
గాయం నుంచి కోలుకుని సరిగ్గా ఏడాది తర్వాత భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న రోహిత్ శర్మ తన కెరీర్‌లో మూడో సెంచరీని నమోదు చేశాడు. నాలుగేళ్ల తర్వాత టెస్టుల్లో చేసిన సెంచరీ ఇది. ఈ సందర్భంగా రోహిత్ శర్మ నాగ్ పూర్ టెస్టు అనంతరం మీడియాతో మాట్లాడాడు.

నేను లక్కీ
‘జీవితంలో ఒడుదొడుకులు తప్పవు. 10,000 పరుగులు చేస్తే 15,000 చేయాలనుకుంటాం. లేదంటే అభిమానులు 15,000 చేయాలని చెప్తారు. నా వరకైతే నేను మళ్లీ నా కాళ్లపై నిలబడి క్రికెట్ ఆడుతున్నందుకు సంతోషిస్తున్నా. 2016లో తొడకు శస్త్రచికిత్స తర్వాత కనీసం నడవగలనా? అనిపించింది. నేను లక్కీ! తిరిగి నిలబడ్డా. పరుగులు చేస్తున్నా. అందుకు సంతోషం' అని చెప్పాడు.

నా ప్రణాళికలన్నీ చాలా సింపుల్‌గా ఉంటాయి
‘గతంలో జరిగిన సంఘటనలను తలుచుకుంటూ పరిస్థితులను సంక్లిష్టంగా మార్చుకోను. నా ప్రణాళికలన్నీ చాలా సింపుల్‌గా ఉంటాయి. జట్టులోకి వచ్చిన తర్వాత నేను చేయాల్సిన పని క్రికెట్ ఆడటమే. మొదట్లో నా దృష్టంతా టెస్టు క్రికెట్‌పై ఉండేది. బాగా ఆడాలనుకునే వాడిని. అయితే ఆలోచనల్లో పడి నేను చేయాల్సింది మర్చిపోయేవాడిని' అని అన్నాడు.

500 రోజుల తర్వాత బాగా ఆడిన ఇన్నింగ్స్ ఇది
'నాగ్‌పుర్ టెస్టులో నా ప్రదర్శన ఆనందాన్ని ఇచ్చింది. దాదాపు 500 రోజుల తర్వాత బాగా ఆడిన ఇన్నింగ్స్ ఇది. ప్రస్తుతం నా దృష్టంతా ఢిల్లీ వేదికగా జరిగే మూడో టెస్టుపైనే ఉంది. జట్టు కోసం రాబోయే రోజుల్లో మరిన్ని పరుగులు చేస్తాననే నమ్మకం ఉంది. ఇంతకాలం వేచిచూసినందుకు చక్కటి శుభారంభం లభించింది' అని రోహిత్ శర్మ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications