ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతోంది. సెమీఫైనల్స్ బెర్త్ కోసం ఎనిమిది జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇంగ్లాండ్ తన బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకోగా.. మిగిలిన మూడు స్థానాల కోసం ఏడు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నాయి. దీనికి భారత్ కూడా మినహాయింపు కాదు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం టీమిండియా సెమీ ఫైనల్స్ ఆశలను అడుగంటేలా చేసింది.
దీని తర్వాత ఐపీఎల్ సందడి ఆరంభమౌతుంది. ఇప్పటికే ఆక్షన్ వ్యవహారం ముగిసింది. మొత్తం 10 జట్లు పోరాటానికి ఐపీఎల్ టైటిల్ పోరు కోసం సమాయాత్తమౌతోన్నాయి. ఈ పరిణామాల మధ్య లక్నో సూపర్ జెయింట్స్ (LSG) సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. ఈ ఐపీఎల్ సీజన్ కోసం ఓ కొత్త లోగోను ఆవిష్కరించింది. ఉత్తరప్రదేశ్, లక్నో సంస్కృతిని ప్రతిబింబించేలా దీన్ని రూపొందించిందా టీమ్. ఆరంభం నుండి అండగా నిలిచిన అభిమానుల స్ఫూర్తికి అద్దం పడుతుందని తెలిపింది.

ఈ లోగోలో- గరుడ, కిరీటం, ఏనుగు.. ప్రధానంగా కనిపిస్తాయి. వేగం, రాజసం, శక్తికి ఈ మూడూ ప్రతీకలు. గరుడ ధైర్యాన్ని సూచిస్తుంది. వేగంగా పైకి లేచే ధైర్యం, సవాళ్లను ఎదుర్కొనే తెగువ, ఎప్పుడూ వెనుకంజ వేయని తత్వాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. సూపర్ జెయింట్స్ కూడా ప్రతి మ్యాచ్ లో ఇలాగే ఆడుతుందని ఓడిపోయే పరిస్థితుల్లోనూ వేగంగా పైకి లేచే వైఖరికి గరుడ నిదర్శనమని ఎల్ఎస్జీ పేర్కొంది.
కిరీటం- రాజసానికి, గౌరవానికి చిహ్నం. జట్టు మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ మిలియన్ల మంది ఆశలను మోస్తుంది. ఈ జెర్సీని ధరించడం ఒక గౌరవమని పేర్కొంది ఫ్రాంఛైజీ. కోట్లాదిమంది అభిమానులు ఇచ్చే గౌరవం అనే కిరీటాన్ని ఎప్పుడూ కోల్పోకూడదనే ఉద్దేశంతో దీన్ని లోగోలో చేర్చినట్లు తెలిపింది.
ఏనుగు- బలం, తెలివితేటలు, సహనం, ఐక్యతకు ప్రతీక. ఎల్ఎస్జీ జట్టును ఇది అచ్చంగా ప్రతిబింబిస్తుందని ఫ్రాంఛైజీ వివరించింది. ఏనుగులో ఈ నాలుగు లక్షణాలు తమ జట్టు, ప్లేయర్ల మధ్య ఉన్నాయని పేర్కొంది. ఏనుగులా ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ చెక్కుచెదరని అభిమానం తమ సొంతమని తెలిపింది.
ఐపీఎల్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ లో- ఎయిడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ఆవేశ్ ఖాన్, మహ్మద్ షమీ, మయాంక్ యాదవ్, దిగ్వేష్ రాథీ, ఆకాష్ సింగ్, అర్జున్ టెండూల్కర్, అర్షిన్ కులకర్ణి, హిమ్మత్ సింగ్, ఎం. సిద్ధార్థ్, మాథ్యూ బ్రీట్జ్‌కే, మోహ్సిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, షాబాజ్ అహ్మద్ ఉన్నారు.