IPL 2026: పంత్ కాదు.. లక్నోను ముంచేసింది ఆ ఇద్దరే?
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఘోరంగా విఫలమైంది.ఈ సీజన్లో అందరికంటే ముందుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న జట్టుగా లక్నో నిలిచింది. కొద్ది మంది ప్లేయర్లను మినహాయిస్తే జట్టు మొత్తం ఈ సీజన్లో తీవ్రంగా ఇబ్బంది పడింది. ప్లేయర్లతో పాటు లక్నో జట్టు యాజమాన్యం కూడా జట్టు ఈ దుస్థితికి రావడానికి ప్రధాన కారణమైంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడమే లక్నో కొంపముంచింది.
ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్, ఐపీఎల్‌లో ఎంతో అనుభవం ఉన్న కోచ్ టామ్ మూడీ నేతృత్వంలో లక్నో సూపర్ జెయింట్స్ తమ సపోర్ట్ స్టాఫ్‌ను సిద్దం చేసుకున్నప్పుడు ఈ సారి ఈ ఫ్రాంచైజీ టైటిల్ గెలవడం ఖాయమని అందరూ భావించారు. కానీ ఫలితాలు మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా వచ్చాయి. ఈ ఐపీఎల్ సీజన్లో జట్టు ఎక్కడా కూడా సరైన కాంబినేషన్‌ను సెట్ చేయలేకుపోయింది. టోర్నమెంట్ జరుగుతున్నంత సేపూ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్, కెప్టెన్ రిషబ్ పంత్ వేర్వేరు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. వరుస పరాజయాలు, జట్టులో నిరంతరం మార్పులు, బ్యాటింగ్ ఆర్డర్‌లో అస్థిరత.. ఇవన్నీ లక్నో జట్టులో స్పష్టత లోపించిందనే విషయాన్ని స్పష్టంగా చూపెట్టాయి. అయితే ఐపీఎల్ వేలంలో లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా.. రిషబ్ పంత్‌ను ఏకంగా రూ.27.50 కోట్లకు కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రిషబ్ పంత్ భారత క్రికెట్లో పెద్ద బ్రాండ్, మ్యాచ్ విన్నర్ అయినప్పటికీ.. అంత భారీ ధర పెట్టడం వల్ల జట్టు బ్యాలెన్స్ దెబ్బతింది.

లక్నో జట్టుకు విదేశీ ఫాస్ట్ బౌలర్ల కొరత ఈ సీజన్లో అతిపెద్ద శాపంగా మారింది. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్కియా మినహా.. మిడిల్ ఓవర్లలో లేదా డెత్ ఓవర్లలో మ్యాచ్‌ను మలుపు తిప్పగల ప్రభావవంతమైన విదేశీ పేసర్ లక్నోకు కరువయ్యాడు. పైగా నోర్కియాకు కూడా కేవలం ఒక్క మ్యాచ్‌లోనే ఆడే అవకాశం లభించింది. దీంతో బౌలింగ్ భారీ మొత్తం అనుభవం లేని భారత యువ బౌలర్లపై పడింది. వీరిలో మొహ్సిన్ ఖాన్(11 వికెట్లుధ, ప్రిన్స్ యాదవ్(16 వికెట్లు) మాత్రమే స్థిరంగా రాణించారు. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అక్కడక్కడా మాత్రమే మెరిశాడు. మిగిలిన బౌలర్ల ప్రదర్శన అత్యంత పేలవంగా సాగింది.
గత సీజన్లలో సంచలనం సృష్టించిన యువ పేసర్ మయాంక్ యాదవ్ ఈ సీజన్లో ఘోరంగా ఫ్లాప్ అయ్యాడు. మయాంక్ ఆడిన 4 మ్యాచ్‌లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మరో లెఫ్టార్మ్ పేసర్ ఆకాష్ సింగ్ ఓ మ్యాచ్‌లో బాగానే బౌలింగ్ వేసినా.. తర్వాతి మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. విచిత్రమేమిటంటే.. నికోలస్ పూరన్ వరుసగా వైఫల్యాలు చెందుతున్నప్పటికీ అతడిని జట్టులోనే కొనసాగించారు. జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకున్న తర్వాత కూడా బెంచ్ కే పరిమితమైన ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకపోవడం మేనేజ్‌మెంట్ వైఫల్యానికి అద్దం పడుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా అర్జున్ టెండూల్కర్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. విడ్డూరమేమిటంటే.. లక్నో సోషల్ మీడియా టీమ్ 'అర్జున్ టెండూల్కర్ యార్కర్ ప్యాకేజ్' అంటూ నెట్టింట భారీగా ప్రచారం చేసింది కానీ, జట్టు యాజమాన్యం మాత్రం అతడిని తుది జట్టులోకి తీసుకోవడానికి మొగ్గు చూపలేదు. క్రికెట్ ప్రపంచంలో వారసత్వం గురించి చర్చలు జరుగుతుంటాయి కానీ, జూనియర్ టెండూల్కర్ విషయంలో కథ రివర్స్ లో ఉంది. అతడిని వేలంలో కొనుగోలు చేస్తారు కానీ, తుది జట్టులో మాత్రం ఆడించరు. మొత్తానికి లక్నో సూపర్ జాయింట్స్ ఐపీఎల్ 2026 ప్రయాణం కేవలం ఓటముల కోసమే కాకుండా.. యాజమాన్యం తీసుకున్న చెత్త నిర్ణయాల వల్ల కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications