రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం లక్నోనే వరించింది. చివరి ఓవర్లో 19 పరుగులు ఇవ్వాల్సి ఉండగా.. వాటిని లక్నో బౌలర్ ఆవేష్ ఖాన్ డిఫెండ్ చేశాడు. దీంతో రాజస్థాన్ జట్టు పది పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.
ఈ ఓటమి తమకు ఒక గుణపాఠం అని రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు. అదే సమయంలో ఈ విజయం గురించి మాట్లాడిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ తెగ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో అతని భుజానికి గాయమైంది. దీని గురించి కూడా వెల్లడించాడు. తన టీంమేట్ విసిరిన త్రో భుజానికి తగిలిందని, అంటే తన కెప్టెన్సీలో ఏదో తప్పుందని నవ్వాడు.

'బ్యాటింగ్ చేసేప్పుడు 10 ఓవర్లు ముగిశాయి. అప్పుడు మాకు వచ్చిన మెసేజ్ ప్రకారం 165 అంటే మంచి టోటల్. కాబట్టి 160 పరుగులు చేయడానికి ట్రై చేయాలి. రాజస్థాన్ క్వాలిటీ టీం. వాళ్ల దగ్గర అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. అందుకే మా లక్ష్యాన్ని మరీ ఎత్తుగా పెట్టుకోలేదు. కానీ అనుకున్న దాని కన్నా పది పరుగులు తక్కువ చేయాల్సి వచ్చింది. చివరకు మా బౌలింగ్‌తో ఆ నష్టాన్ని పూడ్చుకున్నాం' అని తెలిపాడు.
'ఆటపై మంచు ప్రభావం ఏమాత్రం లేదు. కాబట్టి రెండు జట్లు ప్రశాంతంగా ఆడగలిగాయి. రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్‌ను దృష్టిలో పెట్టుకొని.. మ్యాచ్ ముందు రోజు కనీసం 180 పరుగులు చేయాలని అనుకున్నాం. తొలి ఓవర్లో బౌల్ట్ బౌలింగ్ చూసిన తర్వాత.. బ్యాటింగ్ చాలా కష్టంగా ఉందని అర్థమైంది. మిడిలార్డర్‌లో కూడా మంచి భాగస్వామ్యాలు నెలకొల్పి ఉంటే అనుకున్న స్కోరు చేసి ఉండేవాళ్లం' అని రాహుల్ చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ సంజూ శాంసన్ రనౌట్ అని రాహుల్ అభిప్రాయపడ్డాడు. వెంటవెంటనే ఇలా రెండు వికెట్లు కోల్పోవడంతో రాజస్థాన్ ఒత్తిడిలో పడిందన్నాడు. అదే సమయంలో తమ జట్టుకు ఇది బాగా కలిసొచ్చిందని చెప్పాడు. రాజస్థాన్ జట్టులో మొదటి ముగ్గురు, నలుగురు బ్యాటర్లు చాలా బలమైన ఆటగాళ్లని, వాళ్లను ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిదనే ఆలోచనతోనే తాము ఉన్నామని వివరించాడు. శాంసన్ రనౌట్‌తో అది సాధ్యమైందని తెలిపాడు.