లక్నోతో కీలకమైన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ లభించింది. ఆ టీం రెగ్యులర్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్ కోలుకున్నాడు. భుజం గాయంతో పంజాబ్ కింగ్స్ ఆడిన చివరి రెండు మ్యాచులకు దూరమైన గబ్బర్ ఈ మ్యాచ్‌లో మళ్లీ ఆడుతున్నాడు. మొహాలీలోని పీసీఏ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా మళ్లీ పగ్గాలు అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ధవన్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం తన భుజం బాగానే ఉందని, ఎలాంటి నొప్పి లేదని చెప్పాడు. 'మేం ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాం. మా ముందు ఇంకా ఏడు మ్యాచులు ఉన్నాయి. వీటిలో సాధ్యమైనన్ని గెలిచి ప్లేఆఫ్స్‌కు సులభంగా క్వాలిఫై అవుతామని అనుకుంటున్నా' అని శిఖర్ ధవన్ చెప్పాడు.

తమ జట్టులో కొన్ని మార్పులు జరిగాయని వెల్లడించాడు. మాట్ షార్ట్ స్థానంలో సికందర్ రజాను తీసుకున్నట్లు ప్రకటించాడు. అలాగే కొత్త బౌలర్ గుర్నూర్ బ్రార్ కూడా అరంగేట్రం చేస్తున్నట్లు తెలియజేశాడు. తను పంజాబ్ కింగ్స్‌కు ఆడినప్పుడు ఇక్కడ ఎన్నో మ్యాచులు ఆడానని కేఎల్ రాహుల్ గుర్తుచేసుకున్నాడు. దీంతో తన టీం మొత్తానికి కొన్ని టిప్స్ ఇచ్చానని చెప్పాడు.
ఇక్కడ మంచు ప్రభావం ఉండే అవకాశం చాలా ఉందని, అందుకే టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకోవడానికే ఎక్కువ మొగ్గు చూపుతుందని రాహుల్ అభిప్రాయపడ్డాడు. తమ జట్టులో అయితే ఎలాంటి మార్పులు లేవని, చివరి మ్యాచ్ ఆడిన జట్టుతోనే బరిలో దిగుతున్నామని స్పష్టం చేశాడు. మరి చివరి మ్యాచ్‌లో ముంబైని చిత్తు చేసిన పంజాబ్ గెలుస్తుందా? లేక గుజరాత్ చేతిలో ఓడిన లక్నో విజయం సాధిస్తుందా చూడాలి.
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధవన్ (కెప్టెన్), అథర్వ టైడే, సికందర్ రజా, లియామ్ లివింగ్‌స్టోన్, శామ్ కర్రాన్, జితేష్ శర్మ, షారుఖ్ ఖాన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, గుర్నూర్ బ్రార్, అర్షదీప్ సింగ్
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టొయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బదోనీ, నవీన్ ఉల్ హక్, రవి బిష్ణోయి, ఆవేష్ ఖాన్, యష్ ఠాకూర్