ముంబైతో మ్యాచ్‌లో లక్నో స్టార్ మార్కస్ స్టొయినిస్ చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నోను ఆ టీం తీసుకున్న చెత్త నిర్ణయాలు ఆరంభంలోనే దెబ్బతీశాయి. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ కైల్ మేయర్స్‌ను పక్కన పెట్టేసిన ఈ టీం.. ఓపెనర్‌గా దీపక్ హుడాను పంపింది. ఈ ప్రయోగం ఏమాత్రం ఫలించలేదు. జేసన్ బెహ్రెండాఫ్ వేసిన మూడో ఓవర్లో వరుస బంతుల్లో హుడా (5), ప్రేరక్ మన్కడ్ (0) అవుటయ్యారు.
ఆ తర్వాత కాసేపటికే పీయూష్ చావ్లా తన తొలి బంతికే.. విధ్వంసకర ఓపెనర్ క్వింటన్ డీకాక్ (16)ను పెవిలియన్ చేర్చాడు. ఇలాంటి సమయంలో ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను కెప్టెన్ కృనాల్ పాండ్యా (49) తన భుజాలపై వేసుకున్నాడు. అప్పుడే క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టొయినిస్‌తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక తన వల్ల కాదు అనుకున్న అతను.. ఇన్నింగ్స్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు.

ఇక చివరి డెత్ ఓవర్లలో స్టొయినిస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముఖ్యంగా క్రిస్ జోర్డాన్ వేసిన 18వ ఓవర్లో ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను 47 బంతుల్లోనే 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐపీఎల్‌లో అతనికి ఇదే అత్యుత్తమ స్కోరు కూడా కావడం గమనార్హం. చివర్లో క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ (8 నాటౌట్) భారీ షాట్లు ఆడటంలో విఫలమయ్యాడు.
అయితే స్టొయినిస్ పుణ్యమా అని 150 పరుగులైనా చేస్తుందా? అనుకున్న లక్నో జట్టు ఏకంగా 177 పరుగులు చేసింది. ఏకానా స్టేడియంలో ఈ స్కోరు చాలా మెరుగైనదే అని చెప్పాలి. లక్నో బౌలర్లు కూడా రాణిస్తే ఈ ఛేజ్ ముంబైకి చాలా కష్టంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లలో జేసన్ బెహ్రెండాఫ్ రెండు వికెట్లతో రాణించగా.. పీయూష్ చావ్లా ఒక వికెట్ తీసుకున్నాడు.