కీలకమైన మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ రెడీ అయ్యాయి. ఏకానా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై జట్టు సారధి రోహిత్ శర్మ తాము ఛేజింగ్ చేస్తామని చెప్పాడు. ఇక్కడి పిచ్ నుంచి బౌలర్లకు చాలా సహకారం అందుతుందని తెలిసిందే.
ఈ ఐపీఎల్‌లో ఇక్కడ జరిగిన అన్ని మ్యాచులూ లో-స్కోరింగ్ మ్యాచులే. ఈ క్రమంలోనే పిచ్ గురించి తన అభిప్రాయం చెప్పిన రోహిత్.. 'ఈ పిచ్ బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ ఆడితే ఎలా ఉంటుందో తెలియడం లేదు. అందుకే మా ముందు ఒక టార్గెట్ ఉంటే బెటర్ అని ఫీల్ అవుతున్నా. ఈ పిచ్ మాకు ఒక కొత్త సవాల్ విసురుతుందని తెలుసు. మేం కూడా దానికి సిద్ధంగానే ఉన్నా' అన్నాడు.

'ఇక్కడ సీమర్లు కూడా చాలా ప్రభావం చూపిస్తారని తెలుసు. అందుకే ఈ మ్యాచ్‌లో నలుగురు సీమర్లతో బరిలో దిగుతున్నాం. ఇద్దరు స్పిన్నర్లు కూడా ఆడుతున్నారు. చివరి మ్యాచుల్లో మేం ఆడిన తీరు నుంచి చాలా పాజిటివ్స్ తీసుకోవచ్చు. కానీ మ్యాచ్ రోజున మేం సరిగా ఆడాల్సి ఉంటుంది. మా జట్టులో ఒకే ఒక్క మార్పు చేశాం' అని వెల్లడించాడు.
తమ జట్టులో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ స్థానంలో ఒక ఆఫ్ స్పిన్నర్‌ను బరిలో దింపుతున్నట్లు రోహిత్ తెలిపాడు. మొదట బ్యాటింగ్ చేయడానికి తాము సిద్ధమేనని కృనాల్ పాండ్యా అన్నాడు. తాము ముందు నుంచే మొదట బ్యాటింగ్ చేయాలని అనుకున్నామన్నాడు. తమ జట్టులో చాలా మార్పులు చేశామని తెలిపాడు.
'నవీన్ ఆడుతున్నాడు. కైల్ మేయర్స్ ఆడటం లేదు. ఆవేష్ స్థానంలో హుడాను తీసుకున్నాం. ఇవి కాక మరో ఛేంజ్ కూడా చేశాం. అది గుర్తులేదు. అందరూ ఫిట్‌గానే ఉన్నారు. కానీ ట్యాక్టికల్‌గా ఈ నిర్ణయం తీసుకున్నాం' అని కృనాల్ చెప్పాడు. మరి ఈ టీంకు ఓపెనింగ్ ఎవరు అందిస్తారనేది చూడాలి.
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డీకాక్, మార్కస్ స్టొయినిస్, నికోలస్ పూరన్, ప్రేరక్ మన్కడ్, ఆయుష్ బదోనీ, కృనాల్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, రవి బిష్ణోయి, స్వప్నిల్ సింగ్, మొహ్‌సిన్ సింగ్, నవీన్ ఉల్ హక్
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నేహాల్ వధీర, హృతిక్ షోకీన్, ఆకాష్ మంధ్వాల్, పీయూష్ చావ్లా, జేసన్ బెహ్రెండాఫ్, క్రిస్ జోర్డాన్