ముంబైతో మ్యాచ్‌లో లక్నో టీం మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలు ఆ జట్టుకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ కైల్ మేయర్స్‌ను పక్కన పెట్టేసిన ఈ టీం.. ఓపెనర్‌గా దీపక్ హుడాను పంపింది. ఈ ప్రయోగం ఏమాత్రం ఫలించలేదు. జేసన్ బెహ్రెండాఫ్ వేసిన మూడో ఓవర్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన హుడా (5) విఫలమయ్యాడు.
బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన అతను.. ఆఫ్‌సైడ్ వచ్చిన బంతిని లెగ్ సైడ్ ఆడేందుకు ట్రై చేశాడు. ఈ క్రమంలో గాల్లోకి లేచిన బంతిని టిమ్ డేవిడ్ సులభంగా అందుకున్నాడు. ఆ మరుసటి బంతికే ప్రేరక్ మన్కడ్ (0) గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో విజయంలో కీలక పాత్ర పోషించిన అతను.. ఈ మ్యాచ్‌లో ఘోరంగా ఫెయిలయ్యాడు.

ఆఫ్ స్టంప్ ఆవలగా బెహ్రెండాఫ్ వేసిన బంతిని ఫాలో అయిన అతను.. దాన్ని ఆడటంలో విఫలమయ్యాడు. దీంతో అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ ఇషాన్ కిషన్ చక్కగా అందుకోవడంతో మన్కడ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీంతో ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను క్వింటన్ డీకాక్ (16)తో కలిసిన కెప్టెన్ కృనాల్ పాండ్యా తీసుకున్నాడు.
కానీ పీయూష్ చావ్లా బంతి అందుకోగానే డీకాక్ పని అయిపోయింది. చావ్లా వేసిన తొలి బంతిని డిఫెండ్ చేసుకోబోయిన అతను దాన్ని అంచనా వేయలేకపోయాడు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతిని ఇషాన్ కిషన్ చాలా ఈజీగా క్యాచ్ చేసేశాడు. దీంతో డీకాక్ కూడా నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇదంతా చూసిన ఫ్యాన్స్.. లక్నో మేనేజ్‌మెంట్‌పై మండిపడుతున్నారు.
ఫామ్‌లో ఉన్న కైల్ మేయర్స్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడని, అయితే అతన్ని పక్కన పెట్టామని మ్యాచ్‌కు ముందు కృనాల్ పాండ్యా చెప్పాడు. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతున్న ఫ్యాన్స్.. మేయర్స్ వంటి బిగ్ హిట్టర్ ఇలాంటి పిచ్‌లపై జట్టుకు చాలా అవసరం అని, అలాంటి వాడిని పక్కన పెడితే ఇలాగే ఉంటుందని విమర్శిస్తున్నారు.