కోహ్లీతో పెద్ద గొడవ జరిగిన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ మరో మ్యాచ్‌కు రెడీ అయింది. సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టేందుకు రెడీ అయింది. ఈ మ్యాచ్ కోసం ధోనీ సేన ఇప్పటికే లక్నో చేరుకొని ప్రాక్టీస్ చేస్తోంది. బౌలర్లకు బాగా సహకరించే ఈ పిచ్‌పై మరో లోస్కోరింగ్ మ్యాచ్ జరిగేలా కనిపిస్తోంది.
అయితే బెంగళూరుతో మ్యాచ్‌లో తొడ కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడిన కేఎల్ రాహుల్.. ఈ మ్యాచ్ ఆడేలా కనిపించడం లేదు. అతని కాలు వాపు ఇంకా తగ్గలేదని, అతన్ని అర్జెంటుగా నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీయే)కు పంపాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చెన్నైతో జరిగే మ్యాచ్‌లో రాహుల్ ఆడటం లేదట.

రాహుల్ గైర్హాజరీలో లక్నో టీంకు కృనాల్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు తెలుస్తోంది. లక్నోలోని ఏకానా స్టేడియం పిచ్.. బౌలర్లకు బాగా సహకరిస్తోంది. ఇక్కడ దాదాపు అన్ని మ్యాచులూ లో స్కోరింగ్ మ్యాచులే జరిగాయి. దీంతో చెన్నై, లక్నో మ్యాచ్‌లో కూడా బౌలర్లు చాలా కీలకం కానున్నారు.
చెన్నై తమ జట్టులో పెద్దగా మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. కొన్ని రోజుల క్రితం టేబుల్ టాపర్లుగా ఉన్న ఈ జట్టు.. రాజస్థాన్, పంజాబ్ చేతుల్లో ఓడిపోయి నాలుగో స్థానానికి పడిపోయింది. ఇప్పుడు లక్నోపై గెలిచి మళ్లీ మొమెంటం తమ వైపు తిప్పుకోవాలని ధోనీ సేన భావిస్తోంది.
అదే సమయంలో ఆర్సీబీతో గొడవ తర్వాత మరింత కసిగా బరిలో దిగేందుకు లక్నో టీం రెడీగా ఉంది. చెన్నైపై గెలిచి టాప్-4లో తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని అనుకుంటోంది. మరి కెప్టెన్సీ అనుభవం పెద్దగా లేని కృనాల్ పాండ్యా ఈ మ్యాచ్‌లో జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడో చూడాలి.