ఆర్సీబీతో హీటెడ్ మ్యాచ్ తర్వాత మరో కీలక మ్యాచ్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ రెడీ అయింది. సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో ఆ టీం రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆడటం లేదు. దీంతో కృనాల్ పాండ్యకు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం జరిగింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. ఒక టార్గెట్ పెట్టుకొని ఆడితే గెలిచే అవకాశం ఉంటుందని ధోనీ భావిస్తున్నాడు. అలాగే తమ జట్టులో ఒక కీలక మార్పు చేసినట్లు ధోనీ వెల్లడించాడు. యువ పేసర్ ఆకాష్ సింగ్‌ను పక్కన పెట్టామని, అతని స్థానంలో స్టార్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ ఆడుతున్నాడని వెల్లడించాడు.

'పిచ్ చాలా సమయం వరకు కవర్స్‌తో కప్పేసి ఉంది. దాన్ని ట్యాకిల్ చేయడం కూడా కష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ ఉన్న పరిస్థితులు అన్నింటినీ జాగ్రత్తగా గమనించాలి. అలాగే డే గేమ్ ఆడేటప్పుడు చాలా పరిస్థితులు మారిపోతాయి. ఆకాష్ స్థానంలో దీపక్ చాహర్ వస్తున్నాడు' అని తెలిపాడు. గాయం కారణంగా ఇన్ని రోజులు చాహర్ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే.
టాస్ గెలిచి ఉంటే తాము ముందుగా బ్యాటింగే చేయాలని అనుకున్నట్లు కృనాల్ పాండ్యా వెల్లడించాడు. ఇది తమ హోం గ్రౌండ్ అయినా కూడా వికెట్ ఎలా రియాక్ట్ అవుతుందో తనకు పెద్దగా ఐడియా లేదని చెప్పాడు. రాహుల్ ఆడటకపోవడం జట్టుకు పెద్ద నష్టమేనని, అదే సమయంలో కొత్త వారికి అవకాశం దక్కుతుందని అన్నాడు.
తమ జట్టులో రెండు కీలక మార్పులు చేసినట్లు తెలియజేశాడు కృనాల్. మనన్ వోహ్రా, కరణ్ శర్మ ఆడుతున్నారని పేర్కొన్నాడు. రాహుల్ లేకపోవడంతో ఈ టీంకు ఓపెనర్‌గా ఎవరు వస్తారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే క్వింటన్ డీకాక్‌ను ఆడిస్తారని కూడా అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తే వోహ్రా లేదా హుడాల్లో ఒకరికి ఓపెనింగ్ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కనిపిస్తోంది.
లక్నో జట్టు: మనన్ వోహ్రా, కైల్ మేయర్స్, మార్కస్ స్టొయినిస్, కృనాల్ పాండ్యా (కెప్టెన్), కరణ్ శర్మ, నికోలస్ పూరన్, ఆయుష్ బదోనీ, కృష్ణప్ప గౌతమ్, నవీన్ ఉల్ హక్, రవి బిష్ణోయి, మొహ్‌సిన్ ఖాన్
చెన్నై జట్టు: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్య రహానే, మొయీన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), దీపక్ చాహర్, మతీష పతిరాణా, తుషార్ దేశ్‌పాండే, మహీష్ తీక్షణ