LSG vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు లక్నో సూపర్‌జెయింట్స్‌పై 20 బంతుల్లో 59 పరుగులు చేసి జట్టు విజయంలో అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. లక్ష్యాన్ని ఛేదించే సమయంలో పవర్ ప్లేను సద్వినియోగం చేసుకోవాలనుకున్నానని చెప్పాడు. అభిషేక్ ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ 206 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 10 బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి సాధించింది.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అభిషేక్ శర్మ
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రజెంటేషన్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. తాము ముందుగా బ్యాటింగ్ చేసి ఉంటే తన ప్రణాళిక వేరేలా ఉండేదని అన్నాడు. 200 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు తానా మరింత కష్టపడి పనిచేయాలన్నాడు. ప్రారంభ ఓవర్లలో జాగ్రత్తగా ఆడి ఆ తర్వాత దూకుడుగా ఆడాలని తాను, అథర్వ చర్చించుకున్నట్లు చెప్పాడు. మీరు ఏ అంతర్జాతీయ ఆటగాడిని అడిగినా లక్ష్యాన్ని ఛేదించే సమయంలో పవర్‌ప్లే అనుకూలంగా ఉండేలా చూసుకోవాలని చెబుతారని అభిషేక్ స్పష్టం చేశాడు. అభిషేక్ తన ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు, 4 ఫోర్లు బాదాడు. తాను బాగా రాణిస్తే జట్టు కూడా బాగా రాణిస్తుందని నమ్ముతానని అభిషేక్ పేర్కొన్నాడు.

దిగ్వేష్ రతితో జరిగిన వాగ్వాదంపై అభిషేక్ ఏమన్నాడంటే?
మ్యాచ్ సమయంలో అభిషేక్ శర్మ, లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేష్ రతి మధ్య మాటల యుద్దం జరిగింది. కానీ ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. మ్యాచ్ తర్వాత తాము మాట్లాడుకున్నామని..ఇప్పుడు అంతా బాగానే ఉందని స్పష్టం చేశాడు. దిగ్వేష్ రతి వేసిన 8వ ఓవర్‌లో అభిషేక్ శర్మ(20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 59)ను క్యాచ్ ఔట్ చేశాడు. ఈ ఓవర్ మూడో బంతిని భారీ షాట్ ఆడే క్రమంలో అభిషేక్ శర్మ వికెట్ పారేసుకున్నాడు. సెట్ అయిన బ్యాటర్ ఔటవ్వడంతో దిగ్వేష్ రతి వైల్డ్‌గా రియాక్ట్ అయ్యాడు. తన ట్రేడ్ మార్క్ సిగ్నేచర్ స్టైల్ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ క్రమంలో కాస్త ఓవర్‌గా రియాక్ట్ అయిన దిగ్వేష్.. బయటికి వెళ్లిపోవాలంటూ సైగలు చేశాడు.ఇది నచ్చని అభిషేక్ శర్మ అతనిపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దిగ్వేష్ రతి కూడా అతనికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. అంపైర్లు, ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకొని ఇద్దర్నీ అడ్డుకున్నారు. ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించిన ఈ ఇద్దరికి మ్యాచ్ రిఫరీ జరిమానా విధించే అవకాశం ఉంది. దిగ్వేష్ రతి తన నోట్‌బుక్ వేడుకకు సంబంధించి గతంలో బీసీసీఐ అభిషేక్ శర్మకు జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
లక్నో భారీ స్కోర్..
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్(39 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్‌లతో 65), ఎయిడెన్ మార్క్‌రమ్(38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించగా.. నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 45) దూకుడుగా ఆడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగా(2/28) రెండు వికెట్లు తీయగా.. హర్ష్ దూబే, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డిలు తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.2 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసి గెలుపొందింది. అభిషేక్ శర్మ(20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్(28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35), హెన్రీచ్ క్లాసెన్(28 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 47), కామిందు మెండీస్(21 బంతుల్లో 3 ఫోర్లతో 32) కీలక ఇన్నింగ్స్ ఆడారు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ రతి(2/37) రెండు వికెట్లు తీయగా.. విల్ ఓ రూర్కీ, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ తీసారు.