ఐపీఎల్-2024 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తన జోరు కొనసాగిస్తోంది. శనివారం లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సంజు శాంసన్ (71*; 33 బంతుల్లో, 7x4, 4x6) విధ్వంసం సృష్టించాడు. అతడికి తోడుగా ధ్రువ్ జురెల్ (52*; 34 బంతుల్లో, 5x4, 2x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో 14 పాయింట్లకు చేరుకున్న ఆర్‌ఆర్ తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (76; 48 బంతుల్లో, 8x4, 2x6), దీపక్ హుడా (50; 31 బంతుల్లో, 7x4) అర్ధశతకాలతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్ల (2/31)తో సత్తాచాటాడు. అనంతరం ఛేదనలో రాజస్థాన్ 19 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఛేజింగ్‌లో రాజస్థాన్‌కు అదిరే ఆరంభం లభించింది. బట్లర్ (24; 18 బంతుల్లో, 3x4, 1x6), యశస్వీ జైస్వాల్ (34; 18 బంతుల్లో) దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఎడాపెడా బౌండరీలతో స్కోరుబోర్డు ముందుకు నడిపించారు. అయితే ఆరో ఓవర్‌లో బట్లర్‌ను యశ్ ఠాకూర్ బౌల్ట్ చేశాడు. పవర్‌ప్లే ముగిసిన వెంటనే జైస్వాల్‌ను స్టొయినిస్ ఔట్ చేయడంతో 60/0తో ఉన్న ఆర్‌ఆర్ 60/2గా మారింది.
నాలుగో స్థానంలో వచ్చిన రియాన్ పరాగ్ (14; 11 బంతుల్లో, 1x6) ఎక్కువసేపు నిలవకపోవడంతో రాజస్థాన్ 78 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన ధ్రువ్ జురెల్‌తో కలిసి శాంసన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. తొలుత కుదురుకోవడానికి ప్రయత్నించిన ఈ జోడీ ఆ తర్వాత చెలరేగారు. యశ్ ఠాకూర్ వేసిన 12వ ఓవర్‌లో 17 పరుగులు, మోహ్సిన్ ఖాన్ వేసిన 14వ ఓవర్‌లో 20 పరుగులు పిండుకున్నారు.
మరో ఎండ్‌లో కృనాల్ పాండ్య పొదుపుగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. రాజస్థాన్ విజయ సమీకరణం 5 ఓవర్లలో 53 పరుగులుగా ఉండగా.. బిష్ణోయ్ వేసిన 16వ ఓవర్‌లో శాంసన్ రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదడంతో 16 రన్స్ వచ్చాయి. ఆ తర్వాత మ్యాచ్ రాజస్థాన్ వైపు మళ్లింది. 18వ ఓవర్లో ఇద్దరూ అర్ధశతకాలు అందుకున్నారు. శాంసన్ 28 బంతుల్లో, ధ్రువ్ జురెల్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీలు సాధించారు. యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో సిక్సర్ బాది శాంసన్ జట్టును గెలిపించాడు.
రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్
అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నోకు పేలవారంభం దక్కింది. 11 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. డికాక్ (8; 3 బంతుల్లో, 2x4) బౌల్ట్, మార్కస్ స్టొయినిస్ (డకౌట్, 4 బంతుల్లో)ను సందీప్ శర్మ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన దీపక్ హుడాతో కలిసి ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. రాహుల్ 31 బంతుల్లో, దీపక్ 30 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 62 బంతుల్లో 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
దీపక్ హుడా ఔటైన తర్వాత రాహుల్‌కు మిగిలిన బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. మరోవైపు దూకుడుగా ఆడే క్రమంలో రాహుల్ కూడా ఔటవ్వడంతో స్కోరు వేగం తగ్గింది. నికోలస్ పూరన్ (11; 11 బంతుల్లో, 1x4), ఆయుష్ బదోని (18*, 13 బంతుల్లో, 1x4), కృనాల్ పాండ్య (15*; 11 బంతుల్లో, 1x4) ఆశించినంత దూకుడుగా ఆడలేదు.