చెన్నై సూపర్ కింగ్స్‌కు లక్నో సూపర్ జెయింట్స్ షాక్ ఇచ్చింది. సొంతమైదానంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (57*; 40 బంతుల్లో, 5x4, 1x6) టాప్ స్కోరర్.
ఆఖర్లో ఎంఎస్ ధోనీ (28; 9 బంతుల్లో, 3x4, 2x6) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అజింక్య రహానె (36; 24 బంతుల్లో, 5x4, 1x6), మొయిన్ అలీ (30; 20 బంతుల్లో, 3x6) ఫర్వాలేదనిపించారు. లక్నో బౌలరల్లో కృనాల్ పాండ్య (2/16) రెండు వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ 19 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

కేఎల్ రాహుల్ (82; 53 బంతుల్లో, 9x4, 3x6) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. క్వింటన్ డికాక్ (54; 43 బంతుల్లో, 5x4, 1x6) ఆకట్టుకున్నాడు. రాహుల్-డికాక్ తొలి వికెట్‌కు 139 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. నికోలస్ పూరన్ (23*; 12 బంతుల్లో, 3x4, 1x6) మెరిశాడు. కాగా, మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడాడు. తమ జట్టు ఓటమికి కారణాలు వివరించాడు.
ఇన్నింగ్స్ మధ్యలో నెమ్మదించినా ఆఖర్లో దూకుడుగా ఆడి గొప్పగానే ముగించామని రుతురాజ్ చెప్పాడు. కానీ ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూల్ రూల్ కారణంగా మరో 15 నుంచి 20 పరుగులు అదనంగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నాడు. తమ జట్టులో ఉన్న కొన్ని లోపాలను సరిదిద్దాలని, పవర్‌ప్లేలో వికెట్లు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని రుతురాజ్ పేర్కొన్నాడు.
''బ్యాటుతో బాగానే ఇన్నింగ్స్ ముగించాం. మేం ఉన్న పరిస్థితుల్లో మెరుగ్గానే ఆడాం. కానీ మేం సాధించిన శుభారంభాన్ని పవర్‌ప్లే అనంతరం కొనసాగించలేకపోయాం. క్రమంగా వికెట్లు కోల్పోయాం. మేం 10 నుంచి 15 పరుగులు తక్కువగా చేశాం. అయితే ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్ రూల్ ఉండటంతో మేం చేసిన స్కోరు సరిపోదు. కనీసం మరో 15-20 పరుగులు అదనంగా చేయాల్సిందే''
''ఇలాంటి పిచ్‌లు నిదానంగా అనిపిస్తాయి. కానీ మంచు ప్రభావంతో బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంది. ఇక్కడ 190 పరుగులు చాలా మంచి స్కోరు. మేం ఓ విషయంలో మెరుగవ్వాలి. పవర్‌ప్లేలో వికెట్లు తీయాలి. ఇలా చేస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావొచ్చు. దీనిపై మేం సాధన చేస్తాం. లక్నోతోనే తర్వాతి మ్యాచ్‌లో తలపడనున్నాం.
చెపాక్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌కు సరైన ప్రణాళికలతో వస్తాం. సొంతమైదానంలో వరుసగా మాకు మూడు మ్యాచ్‌లు ఉన్నాయి'' అని రుతురాజ్ పేర్కొన్నాడు. చెపాక్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో సీఎస్కే మంగళవారం తలపడనుంది. ఆ తర్వాత అదే వేదికగా ఏప్రిల్ 28న సన్‌రైజర్స్ హైదరాబాద్, మే 1న పంజాబ్ కింగ్స్‌తో పోటీపడనుంది.