లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (57*; 40 బంతుల్లో, 5x4, 1x6)) టాప్ స్కోరర్. ఆఖర్లో ఎంఎస్ ధోనీ (28*; 9 బంతుల్లో, 3x4, 2x6) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలరల్లో కృనాల్ పాండ్య (2/16) ఆకట్టుకున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్ తొలి బంతికే రచిన్ రవీంద్ర గోల్డన్ డకౌటయ్యాడు. మోహ్సిన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ (17; 13 బంతుల్లో, 1x4) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. దీంతో సీఎస్కే 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

అయితే నాలుగో స్థానంలో శివమ్ దూబె (3; 8 బంతుల్లో)కు బదులుగా రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. మరో ఓపెనర్ అజింక్య రహానె (36; 24 బంతుల్లో, 5x4, 1x6)తో కలిసి జడేజా కాస్త దూకుడగా ఆడటానికి ప్రయత్నించాడు. వీరిద్దరు బౌండరీలు బాదడంతో పవర్‌ప్లేలో చెన్నై 51 పరుగులు చేసింది. కానీ ఆ తర్వాత రహానెను కృనాల్ పాండ్య క్లీన్‌బౌల్డ్ చేయడంతో సీఎస్కే కథ మారిపోయింది.
దూబె, రహానె స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సమీర్ రిజ్వీ ( 1; 5 బంతుల్లో) విఫలమయ్యారు. దీంతో 90 పరుగులకే చెన్నై అయిదు వికెట్లు కోల్పోయింది. కానీ మరో ఎండ్‌లో ఉన్న జడేజా.. మొయిన్ అలీ (30; 20 బంతుల్లో, 3x6) తో కలిసి స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. ఓ దశలో జడ్డూ, అలీ నిలకడగా ఆడటంతో 15 ఓవర్లలో సీఎస్కే 105 పరుగులే చేసింది. ఆ తర్వాత వీరిద్దరు గేర్ మార్చారు. మొహ్సిన్ ఖాన్ బౌలింగ్‌లో జడేజా సిక్సర్ బాది 34 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.
రవి బిష్ణోయ్ వేసిన 18వ ఓవర్‌లో మొయిన్ అలీ వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. కానీ మరో భారీ షాట్‌కు యత్నించి అదే ఓవర్‌లో అలీ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఎంఎస్ ధోనీ బ్యాటు ఝుళిపించాడు. మొహ్సిన్ ఖాన్ బౌలింగ్‌లో వరుసగా ఫోర్, సిక్సర్ బాదాడు. యశ్ ఠాకూర్ వేసిన ఆఖరి ఓవర్‌లోనూ ఓ సిక్సర్, రెండు బౌండరీలు సాధించాడు. దీంతో చెన్నై చివరి రెండు ఓవరల్లో 34 పరుగులు చేసింది.