ఐపీఎల్-2024 సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. లక్నో వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన లక్నో ఇవాళ మ్యాచ్‌తో తిరిగి గెలుపు బాట పట్టాలని కసిగా బరిలోకి దిగుతోంది. ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన LSG మూడింట్లో గెలిచి, మిగిలిన మ్యాచ్‌ల్లో పరాజయాన్ని చవిచూసింది.
మరోవైపు చివరి రెండు పోరుల్లో గెలిచిన సీఎస్కే మరో విజయంపై కన్నేసింది. లక్నోను చిత్తుచేసి ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది. అయితే ఇరు జట్లకు కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. విదేశీ బ్యాటర్లు డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర ఫామ్‌లో లేకపోవడం చెన్నై జట్టును కలవరపెడుతోంది.

ఇక లక్నో సూపర్ జెయింట్స్ విషయానికొస్తే.. తన అరుదైన ట్రాక్ రికార్డును కోల్పోయింది. 160+ స్కోరు సాధించి ఓటమెరుగని జట్టుగా పేరున్న లక్నో గత రెండు మ్యాచ్‌ల్లో తక్కువ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. 167 రన్స్ టార్గెట్‌ను ఢిల్లీ 18.1 ఓవర్లలో, 161 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 16వ ఓవర్లలోపే ఛేదించింది. కాగా, ఐపీఎల్‌లో ఇరు జట్లు రెండు సార్లు తలపడగా చెరో మ్యాచ్‌లో నెగ్గాయి.
టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. వికెట్ మంచిగా అనిపిస్తుందని, ఇవాళ మంచు కీలకపాత్ర పోషించదని భావిస్తున్నానని రాహుల్ చెప్పాడు. షామర్ జోసెఫ్ స్థానంలో మ్యాట్ హెన్రీ తుదిజట్టులోకి వచ్చాడని అన్నాడు. మరోవైపు సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. డారిల్ మిచెల్, శార్దూల్ ఠాకూర్ స్థానంలో మొయిన్ అలీ, దీపక్ చాహర్‌ను తీసుకున్నామని పేర్కొన్నాడు. వేలంలో రూ.14 కోట్లకు సొంతం చేసుకున్న మిచెల్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. దీంతో ఇవాళ మ్యాచ్‌లో అతనిపై వేటు వేశారు. శార్దూల్‌ను రూ.4 కోట్లకు దక్కించుకున్నారు.
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, ఆయుష్ బదోని, స్టొయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్, మోహ్సిన్ ఖాన్, మ్యాట్ హెన్రీ, యశ్ ఠాకూర్.
చెన్నై సూపర్ కింగ్స్: రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అజింక్య రహానె, మొయిన్ అలీ, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్, పతిరనా.