PBKS VS LSG: ఐపీఎల్ 2025లో భాగంగా ఏకనా మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ పై లక్నో జట్టు ఓడింది. 8 వికెట్ల తేడాతో పరాజయం పొందింది. ఈ క్రమంలోనే లక్నో మెంటార్ జహీర్ ఖాన్.. తమ జట్టు ఓటమి చెందడంతో పిచ్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఓటమి తమకు తీవ్ర నిరాశ కలిగించిందని పేర్కొన్నాడు.
అతడు తయారు చేశాడేమో..
"ఈ రిజల్ట్ నాకు తీవ్ర నిరాశను కలిగించింది. ఇది మా సొంత మైదానంలో జరిగిన మ్యాచ్. ఇతర జట్టు తమ సొంత మైదానంలో పిచ్‌ను తమకు అనుకూలంగా ఉండేలా తయారు చేయించుకుంటుంటాయి. కానీ ఇక్కడ లక్నో పిచ్ అలా లేదు. ఈ పిచ్ ను పంజాబ్ క్యూరేటర్ తయారు చేసినట్లు అనిపించింది." అని జహీర్ ఖాన్ అన్నాడు.

ఇకపై జరగకుండా...
"ఇలాంటి తప్పిదాలను గుర్తించి పరిష్కరిస్తాం. నాకు ఈ సెటప్ కాస్త కొత్తదనే చెప్పాలి. ఇదే మాకు మొదటి,చివరి మ్యాచ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇకపై పిచ్ విషయంలో ఇలాంటి పొరపాట్లు జరగవని భావిస్తున్నాను. లక్నో ఫ్యాన్స్ ఎన్నో అంచనాలతో ఇక్కడికి వచ్చారు. వారిని నిరుత్సాహానికి గురి చేయడం మంచిది కాదు. ఈ ఓటమిలోని పాఠాలు నేర్చుకొని ముందుకు సాగుతాం. కచ్చితంగా తర్వాతి మ్యాచుల్లో విజేతగా నిలుస్తాం" అని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచులో లక్నో 7 వికెట్లకు 171 రన్స్ చేసింది. పూరన్ (30 బంతుల్లో 44; 5×4, 2×6), బదోని (33 బంతుల్లో 41; 1×4, 3×6) పర్వాలేదనిపించారు. అర్ష్‌దీప్ (3/43), యాన్సెన్ (1/28), చాహల్ (1/36), మ్యాక్స్‌వెల్ (1/22), ఫెర్గూసన్ (1/26) లక్నోను అడ్డుకున్నారు. లక్ష్య ఛేదనలో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 69; 9×4, 3×6), శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 52 నాటౌట్; 3×4, 4×6), నేహాల్ వధేరా (25 బంతుల్లో 43 నాటౌట్; 3×4, 4×6) అద్భుతంగా రాణించారు. దీంతో పంజాబ్ లక్ష్యాన్ని పంజాబ్ 16.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.