న్యూఢిల్లీ/సెయింట్ లూసియా: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కోసం అతని ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మ రెక్కలు కట్టుకుని ఎగిరిపోయింది. గత కొంత కాలంగా దూరంగా ఉంటున్న ఈ ప్రేమ పక్షులు.. తిరిగి దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ సినిమా షూటింగ్‌లో ఉన్న అనుష్క కరీబియన్ టూర్‌లో ఉన్న ప్రియుడు కోహ్లీని కలిసేందుకు వెళ్లింది. మూడో టెస్టు సందర్భంగా సెయింట్ లూసియానా స్టేడియంలో స్టాండ్స్‌లో కోహ్లీని ఉత్తేజపరిచిందని ముంబై మిరర్ తన కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. మూడో టెస్ట్ సందర్భంగా టీ షర్ట్, డెనిమ్ జీన్స్ వేసుకున్న అనుష్క శర్మ.. మైదానంలో ఉన్న కోహ్లీని ఉత్సాహ పర్చింది. ఆ తర్వాత మ్యాచ్ విరామ సమయాల్లో కోహ్లీతో కలిసి నగరంలో సరదాగా చక్కర్లు కొట్టినట్లు సమాచారం.
కొంత కాలం క్రితం వరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిని ఈ జంట.. ఇటీవల దూరం దూరంగా ఉన్నారు. అయితే, ఈ ప్రేమ జంట కొద్ది రోజుల నుంచే మళ్లీ తమ ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ విరామంలో కోహ్లీ కోసం అనుష్క వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరూ డేటింగ్ కూడా చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.