2028 Los Angeles Olympics: లాస్ ఏంజిలెస్ వేదికగా 2028 ఒలింపిక్ గేమ్స్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే చివరి సారిగా 1900లో ఒలింపిక్స్ లో క్రికెట్ జరిగింది. మళ్లీ ఇప్పుడు ఇన్నాళ్లకు అంటే, దాదాపు 128 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మక లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్ లో క్రికెట్‌కు చోటు లభించింది. తాజాగా ఈ ఒలింపిక్స్ లో క్రికెట్ కు సంబంధించిన మరో కొత్త విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఒలింపిక్స్ నిర్వాహకులు.
ఆ ఫార్మాట్‌లో..
ఈ లాస్ ఏంజెలిస్ 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను T20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు నిర్వాహకులు. మెన్స్, ఉమెన్స్ విభాగాల్లో 6 జట్లు చొప్పున పాల్గొననున్నాయి. ఒక్కో జట్టు నుంచి 15 మంది చొప్పున మొత్తం 90మంది క్రికెటర్లకు అనుమతినిస్తూ ఐఓసీ నిర్ణయం తీసుకుంది.
టీ20 ర్యాంకింగ్స్ లో ఉన్న టాప్-6 జట్లే ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం ఉందని తెలిసింది. అయితే అమెరికా హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న నేపథ్యంలో వారికి మాత్రం నేరుగా ప్రవేశం దక్కే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. దీని బట్టి, మిగతా ఐదు స్థానాలకు మాత్రం ర్యాంకింగ్స్ లో జట్టు పోటీ పడాలి.

ఒలింపిక్ రేసులో ఆ జట్లు ముందు..
ప్రస్తుతం పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ టాప్ 5లో ఉన్నాయి. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, భారత్, దక్షిణాఫ్రికా జట్లు ముందున్నాయి. కానీ 2028 ఒలింపిక్స్ ఇంకా నాలుగేళ్లు సమయం ఉంది కాబట్టి, ఈ ర్యాంకింగ్స్‌లో మార్పులు జరగొచ్చు.
ఒలింపిక్స్ లో భారత్ - పాక మ్యాచ్..
ఒలింపిక్స్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్లు ఆడితే, అది క్రికెట్ అభిమానులకు అసలైన మజానిస్తోందన్న సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే, వారు టాప్ - 5లో చోటు సంపాదించుకోవడం కోసం గట్టిగానే పోటీ పడాల్సిన అవసరం ఉంటుంది. కాగా, చివరిసారిగా 1900 పారిస్ ఒలింపిక్స్ లో గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.