హైదరాబాద్: ఈ సీజన్‌లో ఆడే 24 వన్డేలతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన మునుపటి ఫామ్‌ని అందుకుంటాడనే నమ్మకం ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా గురువారం రెండో వన్డే జరగనున్న నేపథ్యంలో బుధవారం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.
"జట్టులోని ప్రతి క్రికెటర్ పోషించాల్సిన పాత్రపై మాకు చాలా స్పష్టత ఉంది. రాబోవు సీజన్‌లో వారికి వీలైనన్ని ఎక్కువ అవకాశాలిస్తాం. ముఖ్యంగా ధోనీకి ఈ ప్రణాళిక చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అతను ఇప్పుడు టెస్టు క్రికెట్ ఆడటం లేదు. కాబట్టి ఈ సీజన్‌లో ఆడే 24 వన్డేలతో అతను మునుపటి ఫామ్ అందుకుంటాడే నమ్మకం ఉంది" అని కోహ్లీ అన్నాడు.

ధోనితో పాటు ప్రస్తుతం జట్టులో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇదొక మంచి అవకాశమని కోహ్లీ చెప్పాడు. మరోవైపు పల్లెకెలె వికెట్ కూడా తొలి వన్డే ఆడిన దంబుల్లా లాగే ఉంటుందని, జట్టులో మార్పులు చేసేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని కోహ్లీ అన్నాడు.
ఈ సిరిస్‌లో ఇంకా నాలుగు వన్డేలు మిగలున్నాయని, ఒక మ్యాచ్ ముగిసిన వెంటనే జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం లేదని కోహ్లీ తేల్చి చెప్పాడు. అయితే మ్యాచ్‌లో విజయం కోసం జట్టులో మార్పులు ఎప్పుడైనా, ఎలాగైనా జరగొచ్చని కోహ్లీ అన్నాడు. 2019 ప్రపంచ కప్‌ని దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లు మంచి ప్రదర్శన ఇవ్వాలని కోహ్లీ సూచించాడు.
అప్పుడే వారు ప్రపంచకప్ ఆడే జట్టులో ఉంటారని అన్నాడు. తుది జట్టులో ఇద్దరు ఎడమచేతి వాటం స్పిన్నర్లని ఆడించడం కష్టం కాబట్టి, తొలి వన్డేలో కుల్దీప్ యాదవ్ బెంచ్‌కే పరిమితమయ్యాడని అన్నాడు. అతని స్థానంలో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రాణిస్తున్న అక్షర్ పటేల్‌ని తుది జట్టులోకి తీసుకున్నామని కోహ్లీ చెప్పాడు.
శ్రీలంక పర్యటన నుంచే 2019 వరల్డ్ కప్ కోసం జట్టుని రూపొందిస్తామని ఇప్పటికే చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో కోహ్లీ పైవ్యాఖ్యలు చేశాడు. ఇక, కీలక ఆటగాళ్లు జట్టును వీడినప్పుడు భారత్ ఆ ఒత్తిడిని తట్టుకుని ఎలా రాణించింది అని కోహ్లీని అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో జవాబిచ్చాడు.
"ఇది చాలా క్లిష్టమైన సమయం. దేశం తరఫున ఆడుతున్నాం అన్న భావనతో జట్టులోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. మన మైండ్‌సెట్‌ని మార్చుకుని సవాళ్లను స్వీకరించాలి" అని కోహ్లీ అన్నాడు. దంబుల్లా వేదికగా జరిగిన తొలి వన్డేలో కోహ్లీసేన 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరిస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.