న్యూఢిల్లీ: బీసీసీఐలో లోథా కమిటీ సిఫారసుల అమలుపై సుప్రీం కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. లోథా కమిటీ సిఫారసుల అమలుపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా ఛీప్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పుని రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
లోథా కమిటీ సంస్కరణల అమలుపై సోమవారం ఉదయం బీసీసీఐ అధ్యక్షుడు అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో జస్టిస్ లోధా కమిటీ నియామకంతో బీసీసీఐ పరిపాలనలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా అన్న విషయంలో ఐసీసీని తాము సంప్రదించలేదని బోర్డు చీఫ్ అనురాగ్ స్పష్టం చేశారు.
అయితే దీనిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ సారథ్యంలోని సుప్రీం ధర్మాసనం ఈనెల 7న బీసీసీఐని పదిరోజుల్లో ప్రత్యేక అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ సీఈవోతో తాము ఎలాంటి సంప్రతింపులు జరుపలేదని సోమవారం సుప్రీంలో దాఖలు చేసిన తన అఫిడవిట్‌లో అనురాగ్ తోసిపుచ్చారు.
పరిపాలన సంఘంలో కాగ్ సభ్యుడి నియామకంపై అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు, ప్రస్తుత ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ అభిప్రాయం అడిగామని పేర్కొన్నారు. కోర్టులో విచారణ కొనసాగుతున్నందున తానేమి కల్పించుకోలేనని మనోహర్ చెప్పినట్లు ఠాకూర్ తెలిపారు. ఆదివారం వరకు లోథా కమిటీ సిఫారసులను అమలు చేయడం కుదరని బీసీసీఐ తరుపు లాయర్ వాదనలు వినిపించారు.
బీసీసీఐ ఎస్‌జీఎమ్‌పై ఉత్కంఠ: దిగొచ్చిన ఐసీసీ, ఠాకూర్‌కు చోటు
లోథా కమిటీ సంస్కరణ అమలుకు బీసీసీఐ సమయం కోరింది. అయితే లోథా కమిటీ సంస్కరణలను ఎప్పుడు అమలు చేస్తారో కాలపరిమితిని కావాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. చివరకు ఇరు పక్షాలు వాదనలు విన్న సుప్రీం కోర్టు లోథా సంస్కరణల అమలుకు డెడ్ లైన్ పెట్టుకోవాలని బీసీసీఐకి సూచిస్తూ తీర్పుని రిజర్వ్ చేసింది.

కాగా, జస్టిస్ లోథా కమిటీ ప్రతిపాదనల అమలుపై బీసీసీఐ శనివారం ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో చర్చించిన సంగతి తెలిసిందే. బోర్డులో సంస్కరణలు అమలు చేస్తామంటూ బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడంపై చర్చించారు.
అఫిడవిట్‌లో ఉండాల్సిన అంశాలు, ఒకే రాష్ట్రం, ఒకే ఓటు, మూడేళ్లలో కూలింగ్ పీరియడ్ వంటి అంశాలపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. ఠాకూర్ సోమవారం దాఖలు చేసిన అఫిడవిట్‌కు బీసీసీఐ న్యాయబృందం తుది మెరుగులు దిద్దారు.