అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఏం చేస్తున్నాడని ఫ్యాన్స్ చూస్తూనే ఉంటారు. ఈ క్రమంలో తాజాగా సచిన్ చేసిన ఒక యాడ్ పెద్ద దుమారం రేపింది. ఈ యాడ్ చూసిన కొందరు కోపంతో సచిన్ ఇంటి ముందు రచ్చ రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఒక ఆన్‌లైన్ గేమింగ్ యాడ్‌లో సచిన్ కనిపించాడు. ఇది చూసిన చాలా మందికి కోపం వచ్చింది. సచిన్ వంటి ప్లేయర్ ఇలాంటి యాడ్స్ చేయడం ఏంటని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని బాంద్రాలో సచిన్ ఇంటి ముందు కొందరు గొడవ చేశారు. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నేత ఈ గొడవను ముందుండి నడిపించినట్లు తెలుస్తోంది.

'పేటీయం ఫస్ట్ గేమ్'కు సంబంధించిన యాడ్‌లో సచిన్ టెండూల్కర్ కనిపించాడు. దీనిలో ఫ్యాన్స్ ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడి డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. ఈ యాడ్ నుంచి టెండూల్కర్ తప్పుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అయితే దీనిపై సచిన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. భారత రత్న అవార్డు అందుకున్న సచిన్ ఇలా ఆన్‌లైన్ గేమ్‌లను ప్రమోట్ చేయడం తప్పని నిరసనకారుల వాదన.
స్థానికంగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే బచ్చూ కాడూ పార్టీకి చెందిన కొందరు సచిన్ ఇంటి ముందు చేరి గొడవ చేశారు. 'భారత రత్న అవార్డు అందుకున్న వాళ్లు కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. మేం ఈ విషయంపై సచిన్‌కు నోటీస్ పంపుతాం. ఈ విషయంలో తన స్టాండ్ ఏంటని సచిన్ ఇంకా చెప్పలేదు. ఈ కారణంగానే లాయర్‌తో ఆయనకు నోటీస్ పంపాలని డిసైడ్ అయ్యాం' అని కాడూ స్పష్టం చేశారు.
ఇలా ఆన్‌లైన్ గేమింగ్‌ను సచిన్ ప్రమోట్ చేయడం ఆమోదయోగ్యం కాదని కాడూ అన్నారు. 'సచిన్ ఒక భారత రత్న అవార్డు గ్రహీత. ఎంతోమంది అభిమానులు ఉన్న ఇలాంటి గొప్ప వ్యక్తులు గ్యాంబ్లింగ్ యాప్‌లకు అడ్వర్టైజ్ చేయడం ఏంటి? ఈ యాడ్‌ను బ్యాన్ చేయాలని సచిన్ టెండూల్కర్‌తోపాటు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థిస్తున్నా' అంటూ కాడూ ఒక వీడియో కూడా షేర్ చేయడం గమనార్హం.