టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అత్యుత్తమ ఫినిషర్‌యే కాదు, బెస్ట్ వికెట్‌కీపర్ కూడా. రెప్పపాటులో స్టంపౌట్ చేయడంలో ధోనీ సిద్ధహస్తుడు. అంతేకాదు సందర్భాన్ని బట్టి ఫీల్డర్లు అందించే బంతుల్ని గొప్పగా రనౌట్ చేస్తుంటాడు. వికెట్లను చూడకుండా బెయిల్స్ పడగొట్టడంలో ధోనీ స్టైల్‌యే వేరు.
ధోనీ తరహాలో నోలుక్ రనౌట్ చేయడానికి ఎంతో మంది వికెట్ కీపర్లు ప్రయత్నించారు. కానీ అందరూ విజయవంతం కాలేకపోయారు. తాజాగా ధోనీ స్టైల్‌లోనే వికెట్లను చూడకుండా బంగ్లాదేశ్ వికెట్ కీపర్ లిటన్ దాస్ ప్రత్యర్థిని రనౌట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో ఈ సంఘటన జరిగింది.

శ్రీలంక ఇన్నింగ్స్ చివరి బంతికి ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో షనక లాంగాన్ మీదుగా షాట్ ఆడాడు. డబుల్స్‌కు ప్రయత్నించాడు. రిషద్ హొస్సేన్ బంతిని అందుకొని వికెట్ కీపర్ లిటన్ దాస్‌కు త్రో విసిరాడు. దాన్ని అందుకున్న దాస్ వికెట్లను చూడకుండానే వెనక నుంచి బెయిల్స్‌ను పడగొట్టాడు. తన అసాధారణ గ్లవ్స్ వర్క్ చూపించాడు.
2016లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రాస్ టేలర్‌ను ధోనీ ఇదే రీతిలో ఔట్ చేశాడు. వికెట్ల వైపుకు తిరిగి ఔట్ చేస్తే బ్యాటర్ బతికిపోతాడని భావించి చూడకుండా స్టంప్స్ పడగొట్టాడు. కాగా, మూడో టీ20లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 174 పరుగులు చేసింది.
ఓపెనర్ కుశాల్ మెండిస్ (86; 55 బంతుల్లో) టాప్ స్కోరర్. షనక (19; 9 బంతుల్లో) సాధించిన 19 పరుగులే రెండో అత్యధిక స్కోరు. బంగ్లా బౌలర్లలో రిషద్, తస్కిన్ చెరో రెండు వికెట్లు తీశారు.అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ 19.4 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. రిషద్ హొస్సేన్ (53; 30 బంతుల్లో) అర్ధశతకంతో పోరాడాడు. 32 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన జట్టును ఆదుకున్నాడు. శ్రీలంక బౌలర్లలో నువాన్ తుషారా అయిదు వికెట్లతో సత్తాచాటాడు. అంతేగాక హ్యాట్రిక్ కూడా నమోదు చేశాడు. నజ్ముల్, తౌహిద్, మహ్మదుల్లాను వరుస బంతుల్లో ఔట్ చేశాడు.