క్రికెట్ ప్రపంచంలో రెండు వేర్వేరు తరాలకు చెందిన క్రీడాకారులు కలిస్తే ఆ సందడే వేరు. అందులోనూ అది సంగీతం, క్రీడల కలయిక అయితే ఇంకా ప్రత్యకం. సరిగ్గా ఇలాంటి సన్నివేశమే సునీల్ గవాస్కర్, జెమీమా రోడ్రిగ్స్ మధ్య జరిగింది. వారిద్దరి మధ్య జరిగిన మనసును హత్తుకునే సన్నివేశం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. గవాస్కర్ జెమీమాకు ఒక ప్రత్యేకమైన కానుకను అందించారు.
ఏమిటా మాట?
2025 ఐసీసీ మహిళా ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై జెమీమా 127(నాటౌట్) పరుగులతో చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను ఫైనల్‌కు చేర్చింది. ఆ సమయంలో సునీల్ గవాస్కర్ ఓ ఆసక్తికరమైన వాగ్దానం చేశారు. ఒకవేళ భారత్ ప్రపంచ కప్ గెలిస్తే, జెమీమాతో కలిసి తాను ఒక మ్యూజిక్ సెషన్ చేస్తానని చెప్పారు. అన్నట్లుగానే భారత్ కప్ గెలవడంతో, గవాస్కర్ తన మాటను నిలబెట్టుకున్నారు.

ప్రత్యేకమైన కానుక: 'బ్యాట్-ఆర్' (The Bat-ar)
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభానికి ముందు వీరిద్దరూ కలుసుకున్నారు. సునీల్ గవాస్కర్ ఒక అందమైన చెక్క పెట్టెలో ఉన్న 'బ్యాట్-గిటార్' (బ్యాట్ ఆకారంలో ఉండే గిటార్)ను జెమీమాకు కానుకగా ఇచ్చారు. జెమీమా ఆ పెట్టెను తెరుస్తున్నప్పుడు గవాస్కర్ సరదాగా మాట్లాడుతూ.. "నేను ఈరోజు ఓపెనింగ్ బ్యాటర్‌ని కాదు, కాబట్టి నువ్వే బాక్స్ ఓపెన్ చేయి" అని నవ్వులు పూయించారు. "దీనితో ఆడాలా లేక వాయించాలా?" అని జెమీమా అడగ్గా.. "రెండూ చేయొచ్చు, ఎందుకంటే నీ బ్యాటింగ్‌లో కూడా ఓ సంగీత లయ ఉంటుంది" అని గవాస్కర్ ప్రశంసించారు.
'యే దోస్తీ..' అంటూ పాటలు
గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఆగిపోకుండా, వీరిద్దరూ కలిసి కూర్చుని 'షోలే' సినిమాలోని ప్రసిద్ధ 'యే దోస్తీ హమ్ నహీ తోడేంగే' పాటను ఆలపించారు. జెమిమా ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. "సునీల్ సర్ తన మాట నిలబెట్టుకున్నారు. అత్యుత్తమ 'Bat-ar' తో పర్ఫార్మ్ చేసే అవకాశం మాకు దక్కింది" అని రాసుకొచ్చారు. ప్రస్తుతం డబ్ల్యూపీఎల్ 2026లో జెమీమా రోడ్రిగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. నేడు (జనవరి 10) ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆమె తన జట్టును నడిపించనున్నారు.