
బార్సిలోనా: స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ బార్సిలోనాతో తనకున్న రెండు దశాబ్దాల అనుబంధాన్ని అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ తెంచుకున్నాడు. ఆదివారం జరిగిన ఫేర్‌వెల్ సందర్భంగా మెస్సీ మాట్లాడుతూ.. క్లబ్‌ను వీడుతానని ఎన్నడూ ఊహించలేదంటూ భావోద్వేగానికి గురయ్యాడు. కెరీర్ ముగిసేంతవరకు బార్సిలోనాతోనే ఉందామని నిర్ణయించుకున్నానని, అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తాను క్లబ్‌ను వీడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నాడు. అయితే ఎప్పుడో ఒకసారి తాను మళ్లీ తిరిగి వస్తానని ఫుట్‌బాల్ స్టార్ పేర్కొన్నాడు. తన జీవితం బార్కాలోనే ప్రారంభమైందని, ఇక్కడే చాలా నేర్చుకున్నానని తెలిపాడు. తాను ఇప్పుడీ స్థాయిలో ఉండడానికి బార్కానే కారణమని మెస్సీ అన్నాడు.
క్లబ్ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో లియోనెల్ మెస్సీతో కాంట్రాక్ట్‌ను కొనసాగించడం లేదని గురువారం బార్సిలోనా ప్రకటించినవిషయం తెలిసిందే. 17 సీజన్ల పాటు బార్సిలోనాతోనే ఉన్న మెస్సీ.. ఆ క్లబ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. 13 ఏళ్ల వయసులో 2000 సంవత్సరంలో బార్సిలోనాతో మెస్సీ ప్రయాణం మొదలైంది. అయితే ఇలా తన క్లబ్‌ను వీడుతానని ఎన్నడూ ఊహించలేదంటూ మెస్సీ ఏడ్చేశాడు.
'బార్సిలోనాతోనే ఉందామని నిర్ణయించుకున్నాను. ఇది నా ఇల్లు. మన ఇల్లు. బార్కాతోనే కొనసాగాలన్నది నా ప్లాన్. నా జీవితం మొత్తం ఇక్కడే గడిపిన తర్వాత ఇవాళ గుడ్‌బై చెబుతున్నాను' అని మెస్సీ తన ఫేర్‌వెల్ స్పీచ్‌లో అన్నాడు. 'ఎప్పుడూ బార్కాను వదిలి వెళ్తానని అనుకోలేదు. ఈ మహమ్మారి సమయంలో అభిమానులు లేకుండా ఆడుతున్న వేళ ఇది వింతగా ఉంది. ఎప్పుడో ఒకసారి మళ్లీ తిరిగి వస్తాను. క్లబ్‌లో చాలా నేర్చుకున్నాను. ఇప్పుడీ స్థాయిలో ఉండటానికి కారణం ఇదే' అని మెస్సీ అన్నాడు.\
అర్జెంటీనాకు చెందిన మెస్సీకి బార్సిలోనా క్లబ్‌తో దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం. తన 17 ఏళ్ల వయసులో 2004 క్లబ్‌లోకి వచ్చిన అతడు మొత్తం 17 సీజన్లు ఆడాడు. వివిధ లీగుల్లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. క్లబ్ తరఫున 778 మ్యాచ్‌ల్లో 672 గోల్స్ సాధించాడు. మెస్సీ.. ఎఫ్సీ బార్సిలోనాను వీడటానికి ప్రధాన కారణం.. కాంట్రాక్ట్ రెన్యూవల్. లియోనల్ మెస్సీతో కుదుర్చుకున్న కాంటాక్ట్ ఇదివరకే ముగిసింది. దీన్ని పునరుద్ధరించాల్సి ఉందా క్లబ్. రెన్యూవల్ చేయడంలో కొంత జాప్యం ఏర్పడింది. దీనికి కూడా కారణాలు లేకపోలేదు. అర్జెంటీనా ప్రభుత్వం ఇటీవల కొన్ని రకాల రెగ్యులేషన్స్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో స్పోర్ట్స్ సెక్టార్‌ను కూడా చేర్చింది. క్రీడారంగాన్ని సైతం ఈ ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ పరిధిలోకి తీసుకుని రావడం వల్ల కాంటాక్ట్ గడువు ముగిసిన వెంటనే ఎఫ్సీ బార్సిలోనా దాన్ని పునరుద్ధరించలేకపోయింది.
లియోనల్ మెస్సీ తమ క్లబ్‌ను వీడటం వల్ల సంభవించిన నష్టాన్ని భర్తీ చేసుకునే పనిలో పడింది బార్సిలోనా. మెస్సీ రీప్లేస్ కోసం అన్వేషిస్తోంది. అతనికి ధీటుగా కొత్త ఫుట్‌బాలర్‌తో ఈ ఖాళీని పూరించడానికి పూనుకుంది. లియోనల్ మెస్సీ జట్టులో ఉన్న సమమంలో ఎఫ్‌సీ బార్సిలోనే అనేక టైటిళ్లను సొంతం చేసుకుంది. లా లిగా-10, కోపా డెల్ రే-7, ఛాంపియన్స్ లీగ్-4, ఫుట్‌బాల్ వరల్డ్ కప్-3లను గెలచుకుందా క్లబ్. తాను ఆడిన మ్యాచుల్లో 20 సార్లు మెస్సీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆరు సార్లు బాల్లన్ డీ ఆర్‌ను అందుకున్నాడు. అదే సమయంలో మరో స్టార్ స్ట్రైకర్ సెర్గియో వైదొలగాలనుకోవడం కలకలం పుట్టిస్తోంది.