
హైదరాబాద్: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ సౌతాంప్టన్ వేదికగా జరగనుంది. జూన్ 18 నుంచి 22 మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. బయో సెక్యూర్ బబులో జరగనున్న ఈ టెస్టుకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉంది. బ్రిటన్ ప్రభుత్వం దశలవారీగా కరోనా లాక్‌డౌన్ నిబంధనలను సడలించడం ప్రణాళిక ప్రకారం కొనసాగితే.. ఫైనల్‌ను చూడటానికి పరిమిత సంఖ్యలో అభిమానులను అనుమతించాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతో పాటు ఐసీసీ భావిస్తోంది.
మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కేంద్రమైన లార్డ్స్ మైదానంలో ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌ను నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. అయితే ఇంగ్లండ్‌లో తాజా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇది సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చింది. ఒప్పందం ప్రకారం ఇంగ్లండ్‌లో జరపాల్సి ఉండటంతో సౌతాంప్టన్‌కు మ్యాచ్‌ను తరలించారు. ఇక్కడి రోజ్‌బౌల్ మైదానంలో ఇరు జట్లు తుది పోరులో తలపడతాయి. కరోనా నేపథ్యంలో సౌతాంప్టన్ మ్యాచ్ జరిగే వేదిక వద్ద వరల్డ్‌క్లాస్ ప్లేయింగ్, ట్రైనింగ్ సౌకర్యాలు ఉండటంతో ఇరుజట్లు సన్నద్ధంకావడానికి అన్ని రకాలుగా ఉపయోగపడనుంది.
అందరి ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకొని.. రెండు అత్యుత్తమ టెస్టు జట్లు తలపడే ఈ మ్యాచ్‌ను ప్రేక్షకులు చూసే అవకాశం కల్పించడం కోసం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ వేదికగా సౌతాంప్టన్‌ను ఖరారు చేశామని ఐసీసీ జనరల్ మేనేజర్ జెఫ్ అల్‌డ్రైస్ తెలిపారు. గత ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన అన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లకు మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్, సౌతాంప్టన్‌లోని హాంప్‌షైర్ బౌల్ ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే.
సౌతాంప్టన్‌లో ఇప్పటి వరకూ ఆరు టెస్టులు మాత్రమే జరిగాయి. ఇందులో మూడింట్లో ఫలితం తేలింది. ఒక టెస్టులో వెస్టిండీస్ గెలవగా.. మిగతా రెండింట్లో ఇంగ్లండ్ విజయాలు అందుకుంది. అయితే ఆ రెండు విజయాలు భారత్‌పైనే కావడం గమనార్హం. ఇదే వేదికపై 2014లో 266 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించిన ఇంగ్లండ్.. 2018లో 60 పరుగుల తేడాతో మరోసారి ఓడించింది. అయితే సౌతాంప్టన్‌లో న్యూజిలాండ్ ఇంత వరకూ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. ఇది మనకు కలిసొచ్చే అంశం.