క్రికెట్‌లో ఘోరం.. కోచ్, మేనేజర్‌పై జీవితకాల నిషేధం!
మేఘాలయ అండర్-23 మహిళల క్రికెట్ జట్టులో తీవ్ర కలకలం రేగింది. మహిళా క్రికెటర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో జట్టు కోచ్, మేనేజర్‌పై మేఘాలయ క్రికెట్ అసోసియేషన్(MCA) జీవితకాల నిషేధం విధించింది. మేఘాలయ రాష్ట్ర మహిళా కమిషన్ జూన్ 26న జారీ చేసిన ఆదేశాల ఆధారంగా శనివారం షిల్లాంగ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎంసీఏ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు జేమ్స్ పీకే సంగ్మా ఈ కఠిన నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ ఇద్దరు నిందితులు దేశంలో మరెక్కడా ఉపాధి పొందకుండా ఉండేందుకు ఈ జీవితకాల నిషేధం నిర్ణయాన్ని ఇతర రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు కూడా తెలియజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మహిళా క్రికెటర్ల ఫిర్యాదులను తొక్కి పెట్టేందుకు ప్రయత్నించిన ఆరోపణలపై ఎంసీఏ గౌరవ కార్యదర్శి రేయినాల్డ్ ఖార్కమ్నిని కూడా అసోసియేషన్ సస్పెండ్ చేసింది. డిసెంబర్ 2025లో త్రిపుర రాజధాని అగర్తలాలో జరిగిన ఓ టోర్నీ సందర్భంగా బాధితులు ఈ ఫిర్యాదులు చేశారు. అయితే అప్పటి ఎంసీఏ కార్యదర్శి ఈ విషయాన్ని కొత్తగా ఏర్పడిన అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లకుండా దాచిపెట్టారని.. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి బి.డి. అగర్వాల్‌తో కూడిన ఎంసీఏ అంబుడ్స్‌మన్‌కు బదిలీ చేసినట్లు సంగ్మా వెల్లడించారు. కాగా బాధితుల ఆరోపణలు నిజమేనని నిర్ధారించిన మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ ఇయమొన్‌లాంగ్ స్యీమ్, సకాలంలో స్పందించని క్రికెట్ అసోసియేషన్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు.

ఈ ఏడాది మార్చిలో ఎంసీఏ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జేమ్స్ సంగ్మా మాట్లాడుతూ.. లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద తప్పనిసరిగా ఉండాల్సిన 'అంతర్గత ఫిర్యాదుల కమిటీ' అసోసియేషన్‌లో లేకపోవడం తీవ్రమైన లోపమని అంగీకరించారు. త్వరలోనే ఈ కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పాత యాజమాన్యం ఈ ఘోరాన్ని దాచిపెట్టిందని, అప్పట్లో ఫిర్యాదులు అందుకున్న అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని మహిళా కమిషన్ విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు నబా భట్టాచార్జీతో పాటు మరో ఇద్దరు మాజీ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రస్తుత కమిటీ పూర్తి స్థాయిలో సహకరిస్తుందని సంగ్మా స్పష్టం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications