నాటింగ్‌హామ్: ఇంగ్లాండ్, శ్రీలంక జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా జరిగిన తొలి వన్డే మ్యాచ్ 'టై'గా ముగిసింది. ఇరు జట్లు సమాన స్కోరు సాధించడంతో ఫలితం తేలకుండా పోయింది. రెండు జట్లూ గెలుపు కోసం హోరాహోరీగా తలపడినా ఈ మ్యాచ్ నాటకీయ ఫక్కీలో టైగా ముగిసింది. లక్ష్య ఛేదనలో చివరి బంతికి ఇంగ్లాండ్ టెయిలెండర్ లియామ్ ప్లంకెట్ సిక్స్ బాదడంతో 'టై' సాధ్యమైంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. మాథ్యూస్(73), ప్రసన్న(59) అర్ధసెంచరీలతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్, విలే, ప్లంకెట్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అలీ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

కాగా, 287 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 286 పరుగులే చేసింది. 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ చివరి వరకు అద్భుతంగా పోరాడింది. టెయిలెండర్‌గా వచ్చిన లియామ్ ప్లంకెట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
చివరి బంతికి అతడు సిక్స్ బాదడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 10వ స్థానంలో బ్యాటింగ్ దిగిన పంక్లెట్ 11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 22 పరుగులు చేశాడు. వోక్స్(95), బట్లర్(92), మోర్గాన్(43) రాణించారు. శ్రీలంక బౌలర్లలో లక్మాల్, మాథ్యూస్, ప్రదీప్ రెండేసి వికెట్లు తీశారు. కాగా,
వోక్స్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు.