
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టీ20ల్లో కొనసాగాలా వద్దా అన్నది సెలక్టర్లు నిర్ణయిస్తారని భారత క్రికెట్ ఆల్‌రౌండ్ దిగ్గజం కపిల్ దేవ్ అన్నారు. భారత్‌కు తొలి ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ శనివారం 'కృష్ణపట్నం పోర్ట్ గోల్డెన్ ఈగల్స్ గోల్ఫ్ చాంపియన్‌షిప్' కోసం హైదరాబాద్‌కు వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ధోని మంచి ఫామ్‌లో ఉన్నాడని, అతడి భవిష్యత్తు గురించి సెలక్టర్లకే వదిలేద్దామని అన్నాడు. 'ఎవరు కూడా జీవితాంతం క్రికెట్ ఆడలేరు. ఇది అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ధోని బాగానే ఆడుతున్నాడు. ధోనీ భవిష్యత్తు గురించి సెలక్టర్లకే వదిలేద్దాం. మన కంటే వారే బాగా పనిచేస్తారు' అని అన్నాడు.
'క్రికెటర్ల విషయాల్లో బయటి వ్యక్తులు కంటే సెలక్టర్లే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు నేను ఏదైనా అభిప్రాయాన్ని వెల్లడిస్తే అది అభిమానుల్లో ఆందోళన కలగజేస్తుంది. అలా చేయడం నాకు ఇష్టం లేదు. ధోని టి20 భవిష్యత్తు నిర్ణయాన్ని పూర్తిగా సెలక్టర్లకే వదిలేద్దాం. అంతా ఆలోచించిన తర్వాత ధోని ఆడేది లేనిది వాళ్లే చెబుతారు' అని కపిల్ అన్నారు.
మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కర్‌తో పాటు పలువురు టీ20ల్లో ధోనీకి ప్రత్యామ్నాయం చూడాలని, అతని స్థానంలో యువ ఆటగాళ్లకు చోటు కల్పించాలని తమ అభిప్రాయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో రవిశాస్త్రి, కోహ్లీతో పాటు పలువురు ధోనికి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఆటగాళ్ల సామర్థ్యాన్ని తేల్చేందుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించడం సరైనదేనా? అని ప్రశ్నకు కపిల్ తనదైన శైలిలో స్పందించాడు. 'మా తరంలో ఈ డీఎన్‌ఏ టెస్టులేవీ లేవు. కాబట్టి నాకు వాటి గురించి ఏమీ తెలియదు. ప్రస్తుతం చాలా సైన్సు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రశ్న విరాట్ కోహ్లీని అడిగితే మీకు సరైన జవాబు దొరుకుతుంది. ఈ ప్రశ్నకు నేను సమాధానం ఇవ్వలేను' అని అన్నాడు.