భారత క్రికెట్ కోచింగ్‌లో వరల్డ్ కప్ విజేత, మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ శకం మొదలైంది. టీమిండియా ప్రధాన కోచ్‌గా గంభీర్‌ని బీసీసీఐ నియమించింది. ఈ విషయాన్ని మంగళవారం అధికారింకగా వెల్లడించింది. రాహుల్ ద్రవిడ్ వారసుడిగా గంభీరే కోచ్ బాధ్యతలు అందుకుంటాడని ఆది నుంచే ప్రచారం సాగిన విషయం తెలిసిందే. ఆ అంచనాలు ఇప్పుడు నిజమయ్యాయి.
ఈ నెలాఖరున ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటన నుంచి గంభీర్ యాక్షన్ మొదలుకానుంది. అయితే సహాయక సిబ్బంది ఎంపికలో తనకు స్వేచ్ఛను ఇవ్వాలని బీసీసీఐని నయా కోచ్ గంభీర్ కోరాడు. దీనికి బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా లభించింది. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్‌ను టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా గంభీర్ సిఫార్సు చేశాడు. దీనికి బీసీసీఐ అంగీకరించింది.

ఫీల్డింగ్ కోచ్‌గా టి దిలీప్‌నే కొనసాగించాలని గంభీర్ భావిస్తున్నాడు. అయితే బౌలింగ్ కోచ్ ఎవరనే ఉత్కంఠ అందరిలో మొదలైంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ఫాస్ట్ బౌలర్ వినయ్ కుమార్ పేరు ప్రచారంలోకి వచ్చింది.అతన్ని బౌలింగ్ కోచ్ ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం సాగింది. దీనిపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందించారు. వినయ్ కుమార్‌ను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేయడానికి బీసీసీఐ సిద్ధంగా లేదని తెలిపారు.
జహీర్ ఖాన్, లక్ష్మీపతి బాలాజీ పేర్లను పరిశీలిస్తున్నట్లు వివరించరారు. వీరిద్దరిలో ఒకరి నియమించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, తుషార్ దేశ్‌పాండే వంటి యువబౌలర్లను మ్యాచ్ విన్నర్లుగా తీర్చదిద్దడానికి అపారమైన అనుభవం ఉన్న ఫాస్ట్ బౌలర్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ పట్టుదలతో ఉంది. కాగా, 45 ఏళ్ల జహీర్ ఖాన్ 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20లు ఆడాడు. 2011 వన్డే వరల్డ్ కప్ గెలవడంలో జహీర్ ఖాన్‌ది ప్రధాన పాత్ర. ఇక 42 ఏళ్ల బాలాజీ 8 టెస్టులు, 30 వన్డేలు, 5 టీ20లు ఆడాడు. బౌలింగ్ కోచ్‌గా సీఎస్కే, కేకేఆర్ జట్లకు పనిచేశాడు.