గత ఏడాది కాలంగా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా లేని లోటును టీమిండియా అనుభవిస్తూనే ఉంది. గతేడాది జరిగిన ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్, ఇటీవల జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ అన్ని కీలక సరీసుల్లో భారత జట్టులో బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా పేసర్లకు అనుకూలించే పరిస్థితుల్లో జరిగిన టీ20 వరల్డ్ కప్, డబ్ల్యూటీసీ ఫైనల్ ఓడినప్పుడు బుమ్రాను తలుచుకోని ఫ్యాన్ ఉండడు.
ఇలాంటి ఫ్యాన్స్ అందరికీ తాజాగా ఒక శుభవార్త తెలిసింది. ఐర్లాండ్‌తో సిరీస్‌లో బుమ్రా పునరాగమనం చేస్తాడని, ఆ తర్వాత ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ ఆడతాడని తెలిసింది. బుమ్రా చాలా వేగంగా కోలుకుంటున్నాడని, ఈ క్రమంలో అతని పునరాగమనం త్వరలోనే ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే బుమ్రా విషయంలో తొందరపడితే ఆ తర్వాత మొదటికే మోసం వస్తుందని, బుమ్రా ఫిట్‌నెస్ విషయంలో తొందర వద్దని మాజీ కోచ్ రవిశాస్త్రి అంటున్నాడు.

ఈ క్రమంలోనే పాక్ పేసర్ షహీన్ అఫ్రిదీని ఉదాహరణ ఇచ్చాడు రవిశాస్త్రి. 'బుమ్రా చాలా ముఖ్యమైన ప్లేయర్. అందుకని వరల్డ్ కప్ కోసం అతన్ని జట్టులోకి వేగంగా తీసుకుంటే.. ఆ తర్వాత మరో నాలుగు నెలలు అతను ఆటకు దూరమయ్యే ప్రమాదం ఉంది. పాక్ స్టార్ షహీన్ అఫ్రిదీ విషయంలో అదే జరిగింది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి' అని రవిశాస్త్రి చెప్పాడు.
అయితే ఇప్పటికే బుమ్రా 70 శాతం ఫిట్‌నెస్ సాధించినట్లు సమాచారం. అయినా అతన్ని తొందర పెట్టకూడదని బీసీసీఐ అనుకుంటోందట. బెంగళూరులో జరిగే కొన్ని ప్రాక్టీస్ మ్యాచుల్లో అతన్ని ఆడిస్తారని, అక్కడ అతని పెర్ఫామెన్స్ చూసిన తర్వాతనే బుమ్రా విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ అనుకుంటున్నట్లు సమాచారం. అలాగే అతని వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ విషయంలో కూడా ట్రైనర్లు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు తెలుస్తోంది.