
తుస్సుమన్న ఆసీస్..
ముఖ్యంగా ఢిల్లీ వేదికగా జరిగిన రెండో మ్యాచులో కొంచెం పోటీ ఇచ్చేలా కనిపించినా.. చివరకు తుస్సుమంది. స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లను నమ్ముకున్న ఆసీస్ బ్యాటర్లు అడ్డంగా బుక్కయ్యారు. నిజమే భారత్‌ను స్వదేశంలో ఓడించడం అసాధ్యమే. 2012 తర్వాత స్వదేశంలో జరిగిన ఒక్కటంటే ఒక్క టెస్టు సిరీస్ కూడా భారత్ ఓడిపోలేదు. 2011 నుంచి చూసుకున్నా కూడా కేవలం రెండు టెస్టు మ్యాచులు మాత్రమే భారత్ ఓడింది. అయితే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆసీస్ ఇలా తేలిపోవడం మాత్రం ఎవరికీ నచ్చలేదు.

పొట్లంగాళ్లు అంటారు..
ఈ క్రమంలోనే టీమిండియా మాజీ లెజెండ్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ఆసీస్‌కు ఒక సలహా ఇచ్చాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన అతను.. 'ఇది నేను ఆస్ట్రేలియా టీం మేనేజర్‌కు చెప్తున్నా. మీకు అర్థం కావడం కోసమే ఇంగ్లీషులో చెప్తున్నా.. ఏదో ఒకటి చెయ్యండి బాస్. ఈ సిరీస్ చుట్టూ చాలా హైప్ క్రియేట్ అయింది. ఈ సిరీస్‌పై చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. కానీ ఇలాగైతే ఎలా? లేదంటే మిమ్మల్ని పొట్లంగాళ్లు అంటారు. పొట్లం అంటే ప్యాకెట్ అన్నమాట. మిమ్మల్ని ఇప్పటికే పొట్లం కట్టేశారు కదా. ఇప్పుడైనా ఏదో ఒకటి చెయ్యండి' అని శ్రీకాంత్ చెప్పాడు.

తొలి టెస్టులో ఫ్లాప్..
నాగ్‌పూర్ వేదికగా జరిగిన టెస్టులో కూడా ఆస్ట్రేలియా రాణించలేదు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు విఫలమైనా కూడా లబుషేన్, స్టీవ్ స్మిత్ క్రీజులో నిలదొక్కుకున్నట్లే కనిపించారు. కానీ లంచ్ తర్వాత వాళ్లు అవుట్ అవడంతో ఆసీస్ పతనం మొదలైంది. ఆ తర్వాత రోహిత్ శర్మ సెంచరీ, జడ్డూ, అక్షర్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత జట్టు భారీ స్కోరు చేసింది. ఈ లక్ష్య ఛేదనలో ఆసీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఢిల్లీలో పూర్తిగా ఫెయిల్..
ఆ తర్వాత ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతను సత్తా చాటడంతో ఆసీస్ కొంత మెరుగైన స్థితిలో నిలిచింది. అలాగే నాథన్ లియాన్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ కొంత ఉత్కంఠగా మారింది. అయితే మూడో రోజు తొలి సెషన్ మొదలైన గంట వ్యవధిలోనే ఆసీస్ ఆలౌట్ అయిపోయింది. ఇది చూసిన అభిమానులు నోరెళ్లబెట్టారు. ప్రపంచ నెంబర్ వన్ టెస్టు టీంగా ఉన్న ఆసీస్ ఇంత దారుణంగా ఆడటాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోయారు.


Click it and Unblock the Notifications












