
లండన్: బంగ్లాదేశ్ జట్టు కేప్టెన్ ముష్రఫీ మొర్తాజా ప్రపంచకప్ టోర్నమెంట్ ముగిసిన అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతాడంటూ వస్తోన్న వార్తలపై టీమ్ ప్రధాన కోచ్ స్టీవ్ రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యానాలు చేశారు. క్రికెట్‌కు గుడ్ బై చెప్పాలా? వద్దా? అనేది మొర్తాజా ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉందని అన్నారు. రిటైర్‌మెంట్‌పై ఏ నిర్ణయాన్ని తీసుకోవాలనేది మొర్తాజా మీదే వదిలేయడం మంచిదని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మొర్తాజా క్రికెట్‌కు గుడ్ బై చెప్పాలని అనుకోవడం సరికాదని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు స్టీవ్ రోడ్స్ అభిప్రాయపడ్డారు.
ఇప్పుడిప్పుడే బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు బలమైన టీమ్‌లకు సవాలు విసిరే స్థాయికి ఎదిగిందని, ఇలాంటప్పుడు కేప్టెన్‌గా మొర్తాజా సేవలు మరింత కొంతకాలం అందుబాటులో ఉండాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ ప్రస్తుతం తన చిట్టచివరి లీగ్ మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో ఆడుతోంది. అంతకుముందు- భారత జట్టుతో మ్యాచ్‌ను ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమి అనంతరం మొర్తాజా.. జట్టులో తన సమకాలీకులైన షకీబుల్ హసన్, తమీమ్ ఇక్బాల్, ముష్ఫికర్ రహీమ్, మహమ్మదుల్లాలతో కలిసి రిటైర్‌మెంట్ నిర్ణయంపై చర్చించినట్లు తెలుస్తోంది.
ప్రపంచకప్ టోర్నమెంట్ ముగిసిన తరువాత బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లబోతోంది. శ్రీలంకతో ద్వైపాక్షిక సిరీస్‌ను ఆడబోతోంది. ఈ సిరీస్ వచ్చేనెల ఆరంభం కానుంది. శ్రీలంకలో పర్యటించబోయే బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు ఎవరు కేప్టెన్‌గా వ్యవహరిస్తారనేది బోర్డు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉందని స్టీవ్ రోడ్స్ తెలిపారు.
రిటైర్ కావాలా?, వద్దా అనేది మొర్తాజా తీసుకునే వ్యక్తిగత నిర్ణయమేనని అన్నారు.
ఈ దిశగా ఆయన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో సంప్రదించాలని సూచించారు. మొర్తాజా రిటైర్‌మెంట్ కావడం జట్టుపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోదని ఆయన అన్నారు. జట్టులో సీనియర్లు చాలామందే ఉన్నారని చెప్పారు. మరికొన్ని రోజులు మొర్తాజా కేప్టెన్‌గా కొనసాగాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. రిటైర్‌మెంట్ ఆలోచనలను విరమించుకుంటే బాగుంటుందని తాను మొర్తాజాకు సూచిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.