మెల్బోర్న్: క్రీడాకారులు ప్రత్యర్థులను మెచ్చుకోవడం చాలా అరుదైన విషయం. అయితే ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆండ్ర్యూ సైమండ్స్ హైదరాబాదీ బ్యాట్స్ మన్ వివియస్ లక్ష్మణ్ ను ప్రశంసలతో ముంచెత్తాడు. సిడ్నీ టెస్టులో లక్ష్మణ్ సచిన్ టెండూల్కర్ ను మరుగుపరిచేలా ఆడాడని అతను కొనియాడాడు. ఇటీవలే ప్రచురితమైన తన ఆత్మకథ రాయ్ ఆన్ ద రైస్ - ఎ ఇయర్ ఆఫ్ లివింగ్ డేంజరస్ లో సిడ్నీ టెస్టుకు సంబంధించి పలు విచారకరమైన సన్నివేశాలను వివరిస్తూనే లక్ష్మణ్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. సచిన్ టెండూల్కర్ ను మరుగుపరిచే విధంగా ప్రతిభ చూపే బ్యాట్స్ మన్ ను చూడడం చాలా అరుదుగా సంభవిస్తుందని, వివియస్ లక్ష్మణ్ తన 109 పరుగుల ఇన్నింగ్సుతో ఆ పని చేశాడని సైమండ్స్ అన్నాడు. అయితే ఈ ఇద్దరి మధ్య చాలా తేడా ఉందని, అయితే అది మనం చూసే విధానం మీద కూడా ఆధారపడి ఉంటుందని అతను అన్నాడు. లక్ష్మణ్ ఆడుతుంటే చూడడం ఒక గౌరవప్రదమైన విషయమని అతను అన్నాడు. వివియస్ ది మణికట్టు, సమయ ప్రతిభ అని, సచిన్ ది సమతుల్యత, వేగం అని అతను అన్నాడు. ఆ ఇన్నింగ్సులో వారు ఆడిన తీరు అద్భుతంగా ఉందని అతను అన్నాడు.