ICC Womens World Cup 2025: భారత మహిళల జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. భారత అమ్మాయిలు అద్భుతంగా ఆడి దేశ ప్రజల ఆశలను నిలబెట్టారు. సమష్టిగా ఆడి వరల్డ్ కప్ టైటిల్‌ను అందుకుని 'శభాష్' అనిపించుకున్నారు. కానీ దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ పోరాట పటిమకు క్రికెట్ ప్రపంచం హ్యాట్సాఫ్ చెబుతోంది. వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ నిర్దేశించిన 299 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. కానీ ఓ వైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ లారా వోల్వార్డ్ మాత్రం క్రీజులో పాతుకుపోయి ఒంటరి పోరాటం చేసింది.
లారా వోల్వార్డ్ కేవలం 98 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అద్భుతమైన సెంచరీ(101) పరుగులు పూర్తి చేసుకుంది. ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో ఇంత గొప్పగా పోరాడడం ఆమె అంకితభావానికి నిదర్శనంగా నిలిచింది. లారా వోల్వార్ట్ సెంచరీ సాధించిన సమయంలో దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా ఆశలు మిగిలే ఉన్నాయి. ఆమె ఆటతీరు చూసి ఏ క్షణంలోనైనా మ్యాచ్ మలుపు తిరుగుతుందని అభిమానులు భావించారు.

కీలక మలుపు ఇదే..
మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న తరుణంలో టీమిండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ బౌలింగ్‌లో వోల్వార్డ్ భారీ షాట్‌కు ప్రయత్నించి, బౌండరీ లైన్ వద్ద అమన్‌జోత్ కౌర్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు ఔట్ అయ్యింది. ఆమె ఔట్ కావడంతోనే దక్షిణాఫ్రికా విజయ ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయి. ఈ ఫైనల్‌లో సెంచరీ సాధించడం ద్వారా, లారా వోల్వార్డ్ ఈ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచింది. టోర్నీ ఆసాంతం ఆమె చూపిన స్థిరమైన ప్రదర్శన సఫారీ జట్టును ఫైనల్ వరకు చేర్చడంలో కీలకపాత్ర పోషించింది. అయితే లారా వోల్వార్డ్ పట్టిన అమన్‌జోత్ కౌర్ క్యాచ్‌ను 1983 వరల్డ్ కప్ ఫైనల్‌లో కపిల్ దేవ్ పట్టిన వివ్ రిచర్డ్స్ క్యాచ్‌తో పోలుస్తున్నారు.
ఓటమిపై వోల్వార్డ్ స్పందన:
మ్యాచ్ ముగిసిన అనంతరం ఫైనల్లో ఓడినా తమ జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ పేర్కొంది. బ్యాటింగ్ వైఫల్యం వల్లే తాము ఓడిపోయామని అంగీకరించింది. ఈ ఓటమిని ఒక గుణపాఠంగా స్వీకరించి ముందుకు సాగుతామని తెలిపింది.